తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ఈ ఉదయం ప్రారంభమయ్యాయి. సామాన్యులతో పాటు సినీ సెలబ్రెటీలు తమ ఓటు హక్కుని వినియోగించుకునేందుకు లైన్ లో నిలబడ్డారు. ఇప్పటికే చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్, అల్లు అర్జున్ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
హైదరాబాద్ లో ఉదయం 6.50 గంటల ప్రాంతానికే పోలింగ్ స్టేషనుకు వచ్చిన దర్శకుడు రాజమౌళి తన ఓటును వేసేశారు. హీరో అల్లు అర్జున్ సైతం ఓటేసేందుకు క్యూలో వేచివుండి వేసారు. ఆపై వచ్చిన పలు సినీ రాజకీయ ప్రముఖులు, సెలబ్రిటీలు ఓట్లు వేసేందుకు లైన్ లో నిలబడివున్నారు.
నాగార్జున తన సతీమణి అమలతో కలిసి జూబ్లీహిల్స్‌లో ఓటు వేశారు. ఓటు వేయడం ఎంతో ముఖ్యమని, ఐదేళ్లకోసారి వచ్చే ఈ అవకాశాన్ని అందరూ తప్పనిసరిగా వినియోగించుకోవాలన్నారు. ఇది ఓటర్ల రోజని అన్నారు.
తన కుటుంబ సభ్యులందరూ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. రామ్‌చరణ్ విదేశాలకు వెళ్లడంతో ఓటు వేసే అవకాశాన్ని కోల్పోయాడని చెప్పారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అల్లు అర్జున్ విజ్ఞప్తి చేశారు. సినీ కథా రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఫిలింనగర్‌లో ఓటు వేశారు.