బ్రేకింగ్ :తెలుగు హీరో కారు ప్రమాదం.. మహిళ మృతి

‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’ ఫేమ్ సుధాకర్ కోమకుల కారు ఢీకొని ఓ మహిళ దుర్మరణం పాలైంది. ప్రమాదంలో నటుడు సుధాకర్‌ స్వల్పంగా గాయపడ్డారు. గుంటూరు జిల్లాలో శనివారం ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జిల్లాలోని మంగళగిరి మండలం చినకాకాని వద్దవేగంగా వెళుతున్న ఆ కారు.. జాతీయ రహదారిపై మొక్కలకు నీళ్లు పడుతున్న మహిళను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆ మహిళ అక్కడికక్కడే మృతి చెందగా… కారు అదుపుతప్పి డివైడర్ ను గుద్దుకుంది. ప్రమాద సమయంలో కారులో వెళుతున్న నటుడు సుధాకర్ కోమకులకు గాయాలయ్యాయి.

సుధాకర్‌.. శేఖర్‌కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌’ సినిమా ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు. తాజాగా ‘నువ్వు తోపురా’ సినిమాలో హీరోగా నటించారు. మే 3న విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు.

నువ్వు తోపురా సినిమా ప్రచారంలో భాగంగానే సుధాకర్.. హైదరాబాద్‌ నుంచి గుంటూరు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.