కరోనా కారణంగా పనులకి ఆటకం తప్పలేదు. ఏ పని చేసినా భయపడుతూ చేయాల్సిన పరిస్థితి. బయటకు వెళ్లలేని పరిస్థితి. ఇక హైదరాబాద్ సిటీకి చెందిన ప్రజానీకమైతే! అంతా ఇళ్లకే పరిమితమయ్యారు. కొంత మంది సెలబ్రిటీలు సిటీకి దూరంగా ఉన్న ఫామ్ హౌస్ లలో తలదాచుకున్నారు. కరోనా తగ్గే వరకూ సిటీ వైపు చూడకూడదని అందుకు తగ్గ సరంజామాతో వెళ్లిపోయారు. ఈనేపథ్యంలో కొంత మంది సెలబ్రిటీలు కరోనా ఇప్పట్లో పోయేది కాదని డిసైడ్ పెళ్లిళ్లు కూడా చేసుకున్నారు. నిఖిల్ వివాహం అలాగే ప్రభుత్వ గైడ్ లైన్స్ ప్రకారం నిరాడంబరంగా జరిగిపోయింది. ఇక రానా వివాహం కూడా ఆగస్ట్ 8న జరిపించడానికి ముహూర్తం పెట్టేసారు.
సురేష్ బాబు పరిస్థితిని ముందే ఊహించి ఈ నిర్ణయం తీసుకున్నారు. తాజాగా యూత్ స్టార్ నితిన్ వివాహానికి కూడా ముహూర్తం పెట్టేసారు. ఈనెల 26న హైదరాబాద్ లో సింపుల్ గా జరిపించేస్తున్నారు. జులై 26 రాత్రి 8.30 గంటలకు తాళి కట్టే ముహూర్తంగా వచ్చినట్లు తెలుస్తోంది. ఈ పెళ్లికి ఇరు కుటుంబాల సభ్యులు, అతికొద్ది మంది సన్నిహితులు, స్నేహితులు మాత్రమే హాజరవుతారు. అంతకు ముందు వారందరూ ప్రభుత్వ గైడ్ లైన్స్ ప్రకారం కరోనా పరీక్షలు చేయించుకోవాలి. ఇప్పటికే కేసీఆర్ రెండు కుటుంబాల నుంచి కేవలం 100 మంది మాత్రమే హాజరవ్వాలని చెప్పారు. ఈ మాట కరోనా వచ్చిన కొత్తలో చెప్పారు.
ప్రస్తుతం సిటీలో పరిస్థితి దారుణంగా ఉంది. కాబట్టి అంత మందికి అనుమతి ఉండే అవకాశం లేదు. ఈనేపథ్యంలో ఇరు కుటుంబాల నుంచి కేవలం 40 మంది మాత్రమే హాజరవ్వడానికి ఛాన్స్ ఉందని తెలుస్తోంది. వాస్తవానికి నితిన్ పెళ్లి రెండు నెలల క్రితమే జరగాల్సి ఉంది. కరోనా తగ్గిపోతే గ్రాండ్ గా చేసుకోవాలనుకున్నాడు. కానీ పరిస్థితి పీకల మీదకు వచ్చే సరికి నిర్ణయాలు మారినట్లు తెలుస్తోంది. నితిన్ వివాహం చేసుకునే అమ్మాయి పేరు షాలిని. ఆమె ఓ డాక్టర్ అన్న సంగతి తెలిసిందే.