ప్చ్… నాగ్ అలా అనకుండా ఉండాల్సింది, హర్టయ్యారు

ప్రెస్ మీట్ లో నాగార్జున  మాటలపై..విమర్శల వర్షం

అక్కినేని నాగార్జున హీరోగా నటించి, పి.కిరణ్‌తో కలిసి నిర్మించిన చిత్రం ‘మన్మథుడు 2’. రకుల్‌ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్ గా రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వంలో రూపొంది ఇటీవలే విడుదలైంది. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి పెద్దగా ఆదరణ కనిపించటం లేదు. అయినా సరే సక్సెస్ మీట్ పెట్టి మీడియాతో మాట్లాడారు నాగార్జున. అయితే ఇలా సినిమా కలెక్షన్స్ నిలబెట్టడానికి ప్రెస్ మీట్ లు పెట్టడంలో వింతా లేదు..తప్పు లేదు కానీ .. ఆ క్రమంలో తన హిట్స్ తో ఈ బిగ్రేడ్ తరహా సినిమాని పోల్చటం చాలా మందికి నచ్చటం లేదు.

ముఖ్యంగా అన్నమయ్య కలెక్షన్స్ ప్రస్తావిస్తూ ఈ సినిమా గురించి చెప్పటం చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు. అన్నమయ్య సినిమాకు మన్మధుడు 2 కీ పోలికా అంటున్నారు. రెండు ఆయన చేసిన సినిమాలే కావచ్చు కానీ పోల్చదగినవి కావు అని అంటున్నారు.

నాగార్జున మాట్లాడుతూ ‘‘యువతరం ఆలోచనలు ఎలా ఉన్నాయో ఆలోచించి సినిమాలు చేస్తుంటా. అప్పట్లో నేను చేస్తున్న సినిమాలు యువతరానికే కాదు, నాకూ నచ్చడం లేదు కాబట్టి ఇంకేదో చేయాలనే ఆలోచనతోనే ‘గీతాంజలి’ చేశా. ప్రేక్షకులు దాన్ని స్వీకరించడానికి సమయం పట్టింది. ‘నిర్ణయం’ విషయంలోనూ తొలి మూడు రోజులు టెన్షన్ పడ్డాం.

ఇక ‘అన్నమయ్య’ చిత్రాన్నయితే తొమ్మిదో రోజు థియేటర్ల నుంచి తీసేయడానికి సిద్ధమయ్యారు. ఏమైందో తెలియదు కానీ 11వ రోజు నుంచి థియేటర్లు నిండిపోయాయి. ‘మన్మథుడు’ విడుదల తర్వాత కూడా దర్శకుడు విజయ్‌ భాస్కర్‌ ఆందోళన చెందుతుంటే.. ‘కొత్త కథతో తీసిన సినిమా కాబట్టి ప్రేక్షకులకి చేరువ కావడానికి కాస్త సమయం పడుతుంద’ని చెప్పా.

‘మన్మథుడు 2’ని నాలో కొత్తదనం చూసుకొనేందుకే చేశా. ఇలాంటి ప్రయోగాలు చేయడంతోనే ఇంతదూరం వచ్చా. హీరోగానే కాకుండా, ఒక నిర్మాతగానూ సంతృప్తిగా ఉన్నా’’అన్నారు.