వరుస వివాదాలతో `బిగ్ బాస్ 3` మొదలవుతుందా అవ్వదా? అన్న డైలమా నెలకొన్న సంగతి తెలిసిందే. అసలు ఈ సీజన్ ఉండదని కొందరు.. వాయిదా పడిందని మరికొందరు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నారు. లైంగిక వేధింపుల ఆరోపణలు గల్లీ నుంచి దిల్లీ దాకా పాకేయడంతో ఇక షో ఆగిపోయినట్టేనని అంతా భావించారు. అయితే ఇది నిజమా? అంటే.. అబ్బే! అదంతా ఉత్తుత్తేనని తాజా సన్నివేశం చెబుతోంది.
బిగ్ బాస్ 3 .. ఇంత సీన్ క్రియేటైనా కానీ!
ఇన్ని వివాదాలొచ్చినా స్టార్ మా కానీ.. హోస్ట్ నాగార్జున కానీ ఏమాత్రం తగ్గినట్టు కనిపించడం లేదు. మరో 48 గంటల్లోనే `బిగ్ బాస్ 3` ప్రారంభమవుతుందని నాగార్జున ఇప్పటికే ప్రకటించేస్తే.. స్టార్ మా ఆ ఏర్పాట్లలో బిజీగా ఉందట. ఈరోజు నాగార్జున ఇంటిని ముట్టడించి.. అన్నపూర్ణ స్టూడియోని లాక్ చేసిన ఘటనలో ఉస్మానియా విద్యార్థులు అరెస్టయినా దాని ప్రభావం ఈ రియాలిటీ షోపై పడలేదట. కోర్టు కేసులు గొడవలు అంటూ ఇప్పటికే ఈ షోకి బోలెడంత పబ్లిసిటీ కూడా వచ్చేసింది. మహిళా మండళ్లు.. మానవ హక్కుల కమీషన్లు.. యాక్టివిస్టులు ఇప్పటివరకూ ఏమీ చేయలేకపోయారు. మీడియాల ముందు మైకుల్లో గోడు వెల్లబోయడం తప్ప ఇంకేమీ చేయగలిగింది లేదట.
వేధింపుల అరోపణలపై విచారణ ఎంతవరకూ సాగనుంది? అన్నది కూడా సందేహమేనన్న మాట వినిపిస్తోంది. ఇప్పటికే ఓ కేసులో తెలంగాణ హైకోర్టు ఈ రియాలిటీ షో నిర్వాహకులను అరెస్టు చేయొద్దని తీర్పు వెలువరించింది. అందుకే ఇక ఎన్ని గొడవలు జరిగినా షో మొదలైపోతోందట. ఉస్మానియా విద్యార్థులు సీన్ లో ఎంట్రీ ఇచ్చినా అదీ ఆపలేకపోయింది చివరికి. ఈ ఆదివారం 9 పీఎం బిగ్ బాస్ 3 హౌస్ లోకి పార్టిసిపెంట్స్ కి గ్రాండ్ వెల్ కం ఉంటుందట. అటుపై వంద రోజుల పాటు ఈ షోని నిరాఠంకంగానే నడిపించే ప్లాన్ లో స్టార్ మా ఉందట.