ఫస్ట్ లుక్: చైతూ,సామ్ ల ‘మజిలీ’

నిజ జీవిత భార్యా భర్తలైన నాగచైతన్య, సమంత జంటగా నటించిన చిత్రం ‘మజిలీ’.నిన్ను కోరి చిత్రం తో హిట్ కొట్టిన శివ నిర్వాణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను ఈరోజు విడుదల చేశారు. నాగ చైతన్య తన సోషల్ మీడియా ఎక్కౌంట్ ద్వారా షేర్ చేసారు.

‘ఇది నాకెంతో ప్రత్యేకమైన చిత్రం అని చెప్పడానికి చాలా కారణాలున్నాయి. చై, సామ్‌ జంటగా నటిస్తున్న నాలుగో చిత్రమిది. కొత్త ఏడాదిని ఈ చిత్రంలో ఆరంభిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ ఆడ్వాన్స్‌ న్యూఇయర్‌ శుభాకాంక్షలు. శివ నిర్వాణతో కలిసి పనిచేయడం నా కల. ఏప్రిల్‌లో కలుస్తాం’ అని చైతన్య పేర్కొంటూ లుక్‌ను షేర్‌ చేశారు.

ఫస్ట్ లుక్‌లో చై, సామ్‌ ఒకరినొకరు ఆప్యాయంగా పట్టుకున్నట్లుగా కన్పించారు. బ్యాక్‌గ్రౌండ్‌లో వాల్తేరు గ్రౌండ్స్‌, విశాఖపట్నం అని రాసుంది. సమంత, నాగచైతన్య నటిస్తున్న తొలి చిత్రం కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ సినిమాలో సమంత రైల్వే క్లర్క్‌ పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఓ మధ్య తరగతి కుటుంబానికి చెందిన భార్యాభర్తల మధ్య వచ్చే చిన్నపాటి తగాదాలు, ప్రేమనురాగాల నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతోందట. షైన్‌ స్క్రీన్స్‌ బ్యానర్‌పై సాహు గరపాటి, హరీశ్‌ పెద్ది ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.