న‌గ్నంగా క‌నిపించాడు.. అల్ల‌రోడి కంబ్యాక్ కి `నాంది`

                             న‌రేష్ న‌టించిన `నేను.. ప్రాణం` ఇలానే క‌దా?

ఎమోష‌న‌ల్ కంటెంట్ .. వైవిధ్య‌మైన కంటెంట్ ఉంటే చాలు విజ‌యం ద‌క్కిన‌ట్టే. ఇటీవ‌ల విజ‌యం సాధించిన చాలా సినిమాలు ఈ విష‌యాన్ని ప్రూవ్ చేశాయి. అయితే స‌రిగ్గా ఇదే కంటెంట్ ఏడెనిమిదేళ్ల క్రితం అంత‌గా వ‌ర్క‌వుట్ అయ్యేది కాదు. క‌మ‌ర్షియ‌ల్ హంగులు లేనిదే స‌క్సెస్ చాలా క‌ష్టంగానే ఉండేది. అప్ప‌ట్లో అల్ల‌రి న‌రేష్ న‌టించిన నేను.. ప్రాణం లాంటి సినిమాలు బాలేదు అన్న వాళ్లే లేరు. కానీ ఎందుక‌నో క‌మ‌ర్షియ‌ల్ గా విజ‌యం సాధించ‌లేక‌పోయాయి. కాస్త ఎర్లీగా ప్ర‌యోగాత్మ‌క సినిమాలు చేసిన న‌రేష్ కి అదో గుణ‌పాఠ‌మే అయ్యింది.

కానీ ఇప్పుడు మరోసారి అలాంటి ప్ర‌యోగ‌మే చేస్తున్న‌ట్టు అర్థ‌మ‌వుతోంది. న‌రేష్ న‌టించిన తాజా చిత్రం నాది టీజ‌ర్ ఆద్యంతం ఆస‌క్తిని రేకెత్తించింది. ఆధునిక వ్య‌వ‌స్థ‌లో జైలు శిక్ష‌ల నేప‌థ్యంలో సినిమా ఇది. జైళ్ల‌లో ఎలాంటి అప‌రాధం చేయ‌కుండానే మ‌గ్గిపోతున్న ఖైదీల జీవితాల‌పై ర‌క్తి క‌ట్టించే సినిమా ఇదని అర్థ‌మ‌వుతోంది.

“దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాల్లో 2015 నాటికి 1401 జైళ్లు ఉంటే 366781 మంది ఖైదీలు రకరకాలుగా శిక్షలు అనుభవిస్తున్నారు. అందులో దాదాపుగా 250000 మంది తప్పు చేశామో చేయలేదో తెలియకుండానే అండర్ ట్రయిల్ కింద శిక్ష అనుభవిస్తున్నారు“ అంటూ హరీష్ శంకర్ వాయిస్ ఓవర్ తో ఈ టీజర్ ప్రారంభ‌మైంది. అల్లరి నరేష్ అండర్ ట్రయిల్ ఖైదీగా జైలులో అడుగుపెట్టి అక్కడ చిత్ర హింసలు తట్టుకోలేక తప్పించుకునే ప్రయత్నంలో ఏం జ‌రిగింది? అన్న‌ది టీజ‌ర్ లో క‌నిపిస్తోంది. “ఒక మనిషి పుట్టడానికి కూడా తొమ్మిది నెలలే టైమ్ పడుతుంది. మరి నాకు న్యాయం చెప్పడానికేంటి సార్.. ఇన్ని సంవత్సరాలు పడుతోంది“ అంటూ నరేష్ ప్రశ్నిస్తున్నారు. అంటే అన్యాయంగా జైల్లో వేసి నానా హింస‌ల‌కు గురి చేసే పోలీస్ వ్య‌వ‌స్థ‌లోని లోపాల్ని ఎత్తి చూపే ప్ర‌య‌త్న‌మే ఇది. ఇలాంటి సినిమాల్లో ఎమోష‌న్ కి పెద్ద పీట వేస్తార‌న‌డంలో సందేహ‌మేం లేదు. అన‌వ‌స‌ర‌మైన వెకిలి కామెడీల్ని న‌మ్మ‌కుండా ఈసారి న‌రేష్ చేస్తున్న ప్ర‌యోగం స‌ఫ‌ల‌మ‌వుతుందా లేదా?  అల్ల‌రోడి కంబ్యాక్ కి ఇదే నాంది అవుతుందా లేదా? అన్న‌ది చూడాలి.

విజయ్ కనకమేడలను ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తూ.. ఈ చిత్రాన్ని ‘శతమానం భవతి’ దర్శకుడు సతీష్ వేగేశ్న ఎస్.వీ 2 ఎంట‌ర్ టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. అల్లరి నరేశ్ కెరీర్లో 57వ చిత్ర‌మిది. నేడు న‌రేష్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈ టీజ‌ర్ ని విజ‌య్ దేవ‌ర‌కొండ సోష‌ల్ మీడియాల్లో షేర్ చేశారు. సిద్ జే సినిమాటోగ్రఫీ, శ్రీచరణ్ పాకాల నేపథ్య సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ లాయర్ ఆద్య పాత్రలో నటిస్తున్నారు.

Naandhi Teaser | Allari Naresh | Vijay Kanakamedala | Satish Vegesna |SV2 Entertainment