గత కొంతకాలంగా టాలీవుడ్ లో మెగాస్టార్ ఇమేజ్ అమాంతం పెరిగిన సంగతి తెలిసిందే. దర్శకరత్న డా.దాసరి నారాయణరావు తర్వాత పరిశ్రమను ఆదుకునే దేవుడయ్యారు. ప్రస్తుత మహమ్మారీ కష్టకాలంలోనూ ఆయనే ఆదర్శం అయ్యారు. కరోనా క్రైసిస్ చారిటీ (సీసీసీ)ని ప్రారంభించి తక్షణం తిండికి లేని సినీకార్మికుల్ని ఆదుకునే ప్రయత్నం చేసినందుకు ప్రశంసలు దక్కాయి. అటు ప్రభుత్వాల నుంచి సీసీసీకి కావాల్సిన సహకారం అందింది.
అయితే లాక్ డౌన్ 55 రోజులుగా సినీకార్మికులు కనీస భత్యం లేని ధైన్యంలోకి వెళ్లిపోయారు. ఇక ఇండస్ట్రీ పరిస్థితి అల్లకల్లోలంగా మారింది. మరో రెండు మూడు నెలల వరకూ థియేటర్లు తెరవలేం. షూటింగుల అనుమతులు కష్టమేనని సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని క్లియర్ కట్ గా చెప్పేయడంతో పరిశ్రమ డైలమాలో పడిపోయింది. ఆ క్రమంలోనే సినిమా 24 శాఖల ముఖ్యులు మెగాస్టార్ చిరంజీవిని సంప్రదించారని తెలుస్తోంది. ఆ క్రమంలోనే అందరితోనూ ఓ కీలక భేటీ ఏర్పాటు చేయనున్నారని … ఈ భేటీలో సినీపరిశ్రమ సమస్యలపై విస్త్రతంగా చర్చ సాగిస్తారని రివీలైంది.
పరిశ్రమను ఈ గడ్డు కాలంలో ఆదుకునేందుకు ప్రభుత్వాల చర్యలు ఎలా ఉండాలి? అన్నది తాజా భేటీలో చర్చించనున్నారట. అలాగే తెలంగాణ సీఎం కేసీఆర్ ని .. ఏపీ సీఎం జగన్ ని మెగాస్టార్ చిరంజీవి కలిసేందుకు సిద్ధమవుతున్నారట. ప్రస్తుత టాలీవుడ్ పరిస్థితిని సమీక్షించాలని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని ఆయన కోరనున్నారట. ఉపాధిని కల్పించేందుకు కొన్ని వెసులుబాట్లు ఇవ్వాల్సిందిగా కోరనున్నారట. ఇక హాలీవుడ్ తరహాలో పరిమిత క్రూతో షూటింగులకు అనుమతులు పొందాలన్న ఆలోచన ఉంది. పనిలో పనిగా సినీపరిశ్రమలో స్టార్ల పారితోషికాల తగ్గింపు సహా అన్ని విషయాలపైనా కూలంకుశంగా చర్చ సాగనుందని భావిస్తున్నారు. ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్ లో షూటింగులకు అనుమతులు లభించాయన్న ప్రచారం ఉంది. ఆ క్రమంలోనే కేసీఆర్ వైపు నుంచి గ్రీన్ సిగ్నల్ రావాల్సి ఉంది. చిరు ప్రస్తుతం ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఏం మాట్లాడతారు? అంతకుముందే పరిశ్రమ ముఖ్యులతో ఏ విషయాలు చర్చిస్తారు? అన్నది తెలియాలంటే కాస్త వేచి చూడాలి.