మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న 152వ చిత్రం `ఆచార్య`లో ఓ ముఖ్యమైన పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లేదా సూపర్ స్టార్ మహేష్ కానీ నటించే ఛాన్సుందని కొద్ది రోజులు గా కథనాలు వేడెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. చరణ్ ఆర్.ఆర్.ఆర్ లో నటిస్తుండటంతో డేట్లు సర్దుబాటు కష్టమని…అందుకు రాజమౌళి ఒప్పుకోవడం లేదని దీంతో ఆస్థానంలో సూపర్ స్టార్ మహేష్ ను ఒప్పించారని జోరుగా ప్రచారం సాగింది. అటు మెగాస్టార్…ఇటు మరో సూపర్ స్టార్ తోడైతే సినిమా స్థాయి స్కైని టచ్ చేస్తుందని కథనాలు వేడెక్కించాయి. తాజాగా వీటన్నింటిపైనా చిరంజీవి ఓ ఇంటర్వూలో క్లారిటీ ఇచ్చారు.
“ఆచార్యలో మహేష్ నటిస్తున్నాడని కాదు గానీ.. చరణ్ నటిస్తున్నట్లు ప్రచారం సాగింది. అప్పుడు పొరపాటున నోరు జారి ఆచార్య టైటిల్ చెప్పేసా. ఇప్పుడు మహేష్ పేరు ఎలా వచ్చిందో తెలియదు. నేనంటే మహేష్ కి ప్రేమ… అభిమానం. అలాగే అతనంటే నాకు చాలా ఇష్టం. మహేష్ తో సినిమా చేసే అవకాశం వస్తే అద్భుతం. తను నా బిడ్డలాంటి వాడు. ఈ సినిమా ప్రారంభం దగ్గర నుంచి చరణ్ ఓ పాత్ర చేస్తే బాగుంటుందని కొరటాలకు ముందు నుంచి ఉంది. కానీ చరణ్ ఆర్.ఆర్.ఆర్ తో బిజీగా ఉన్నాడు. అందువల్ల ఆ సినిమా పూర్తికాకుండా డేట్లు ఇవ్వగలడా? అన్న మీమాంస అందరిలో ఉంది. ఒకవేళ రాజమౌళి గారు..కొరటాల ఓ అండర్ స్టాండిగ్ కి వస్తే అది సాద్యమవుతుంది.
ఆచార్యలో చరణ్ ఉండొచ్చు. కుదరకపోతే నేనేం చేయలేను. చరణ్ తో కలిసి పూర్తి సినిమా చేయాలని నా భార్య సురేఖ చాలాసార్లు కోరింది. అది సురేఖ డ్రీమ్. మరి ఆ తల్లి కోరిక నెరవేరుతుందో లేదో చూడాలి. అలాగే ఆ పాత్రకు సినిమాలో చాలా నిడివి ఉంటుంది. అది గెస్ట్ రోల్ కాదు. హీరోకు ధీటుగా ఉండే పాత్ర అని చిరంజీవి తెలిపారు. దీంతో ఆ పాత్ర సినిమాలో ఎంత ముఖ్యమైనదో తేలిపోయింది. ఇక అంతా రాజమౌళి చేతులోనే ఉంది. తండ్రీ కొడుకులను ఒకే ప్రేమ్ లో చూపించాలని కొరటాల ఆశపడుతున్నాడు. అభిమానులు ఎంతో ఆత్రంగా ఉన్నారు. మరీ ఈ స్పీడ్ కు జక్కన్న బ్రేక్ వేస్తాడా? లేక గో హెడ్ అని వదిలేస్తాడా? అన్నది చూడాలి.