చిరంజీవి తీసుకున్న సంచలన నిర్ణయం ?

Megastar Chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి బయటి సినిమాలు చెయ్యడా? ఇప్పుడు తెలుగు సినిమా రంగంలో పలువురు నిర్మాతలు ఇదే చర్చించుకుంటున్నారు. చిరంజీవి రాజకీయాలలోకి రాక ముందు నటుడుగా కొందరి సినిమాలైనా చేసేవాడు. ప్రజారాజ్యం పార్టీ పెట్టి రాజకీయాల్లో వచ్చిన చిరంజీవి ఎన్నికల్లో పోటీ చేసి తన బలం, బలగం ఏమిటో తెలుసుకున్నాడు. ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ లేదని రూఢీ అయ్యింది. తరువాత తన పార్టీని సోనియమ్మకు అప్పగించి కేంద్రంలో మంత్రి అయ్యాడు. పర్యాటక శాఖను ఎంత గొప్పగా నిర్వహించాడో అందరికీ తెలుసు. 

రాష్ట్రము విడిపోయింది. అదే సమయంలో కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. మంత్రి పదవి పోయినా రాజ్య సభ మిగిలే వుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీలో సభ్యుడుగా కొనసాగాడు. ఏ రాజకీయాల్లో ఉంటే ప్రయోజం లేదనుకొని మళ్ళీ సినిమాలు చేస్తానని ప్రకటించాడు. తన 150 వ సినిమా ప్రతిష్టాత్మకంగా ఉంటుందని నిర్మాతలను ఊరించాడు. చిరంజీవి ప్రకటనతో చాలా మంది నిర్మాతలు ఉత్సాహపడ్డారు. ఎక్కువ డబ్బిచ్చి రచయితలతో కథలు తయారు చేయించుకున్నారు. కొందరైతే చిరంజీవిని కలసి కథలు వినిపించారు.

అంతలోనే చిరంజీవి కుమారుడు హీరో రామ్ చరణ్ 150 సినిమాను తామే నిర్మిస్తున్నామని ప్రకటించాడు. దీంతో నిర్మాతలు తీవ్ర నిరాశకు గురయ్యారు. 151 వ సినిమా కన్నా ప్రయత్నిద్దాం అనుకున్నారు. సైరా నరసింహా రెడ్డి సినిమాను కూడా తామే నిర్మిస్తున్నామని చరణ్ చెప్పాడు. ఇది చారిత్రక సినిమా, ఎక్కువ బడ్జెట్ అవుతుంది కాబట్టి ఆ రిస్క్ తామే తీసుకుంటున్నామని వివరణ ఇచ్చాడు.

 సైరా చిత్రం షూటింగ్ ప్రస్తుతం జార్జియా దేశంలో జరుగుతుంది. ఈ సినిమా షూటింగ్ క్లైమాక్స్ దశకు వచ్చింది కాబట్టి 152వ సినిమా మీద దృష్టి పెడుతున్నారు దర్శకుడు కొరటాల శివ చెప్పిన కథ చిరంజీవికి బాగా నచ్చిందని వెంటనే ఒప్పుకున్నాడని అంటున్నారు. దీనికి రైతు అనే టైటిల్ పెట్టారట. ఈ చిత్రం షూటింగ్ వచ్చే సంవత్సరం లో మొదలవుతుంది. ఈ సినిమాను కూడా చిరంజీవి స్వంత కంపెనీ కొణెదల ప్రొడక్షన్ నిర్మిస్తున్నట్టు తెలిసింది.

అంటే చిరంజీవి తానే స్వంతగా సినిమాలు నిర్మిస్తుంటే కోట్ల రూపాయలు లాభాలు వస్తున్నాయట. అందుకే బయటి నిర్మాతలకు డేట్స్ ఇవ్వకుండా తామే సినిమాలు రూపొందిస్తున్నట్టు తెలిసింది. ఇక రాజకీయాలకు కూడా పూర్తిగా స్వస్తి చెప్పబోతున్నాడు. ఈ నెల 25తో చిరంజీవి రాజ్య సభ సభ్యత్వం అయిపొయింది. ఇక ఇప్పుడు ఆయన స్వేచ్చాజీవి. ఇక ద్రుష్టి అంతా సినిమాల మీదనే. కోట్లా ఆదాయం ఆయన ధ్యేయం. ఎంతైనా మెగా స్టారా? మజాకా?