ఈ బిజినెస్ చేయటమే నా డ్రీమ్: మహేష్ బాబు

హైదరాబాద్‌లోని గచ్చిబౌలీలో మహేష్ బాబు నిర్మించిన ఏఎంబీ సినిమాస్ రీసెంట్ గా ప్రారంభమైన సంగతి తెలిసిందే. మహేష్ తండ్రి, ప్రముఖ నటుడు సూపర్ స్టార్ కృష్ణ దీనిని ప్రారంభించారు. మొత్తం 7 స్క్రీన్లతో, 1,600 సీటింగ్ కెపాసిటీతో ఉన్న థియేటర్లో ‘2.0’ చిత్రం తొలి సినిమాగా ప్రదర్శితమవుతోంది. రూ. 230 నుంచి టికెట్ ధర ప్రారంభం అవుతుండటంతో ఈ థియేటర్‌కు భారీ ఆదరణ ఉంటోంది.

తెలుగు రాష్ట్రాల్లో ఇంత లగ్జరీ థియేటర్ మరొకటి లేదని అక్కడ సినిమా చూసిన వారు చెప్తున్నారు. ఏఎంబీ సినిమాస్‌లో పడుకుని చిత్రాన్ని సినిమాని చూసే సౌలభ్యం ఉండటం కూడా విశేషం. ఏఎంబీ సినిమాస్‌ని 360 డిగ్రీస్‌లో చూసిన ఫీలింగ్ కలుగుతోందని చెప్తున్నారు. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న థియోటర్ నిర్మించటం వెనక ఓ  కల ఉందని  మహేష్ చెప్తున్నారు.

ఓ సంస్థకు చెందిన ప్రమోషన్స్ కార్యక్రమంలో పాల్గొన్న మహేష్… తన కొత్త బిజినెస్ అయిన ఈ మల్టిప్లెక్స్ ల గురించి మాట్లాడారు. మల్టీప్లెక్స్ బిజినెస్ అనేది తన కల అని చెప్పారు. తన కోరిక ఇప్పుడు నెరవేరిందని అన్నారు. ఏషియన్ ఫిల్మ్స్ సహకారంతో తాను ఈ బిజినెస్ చేస్తున్నట్టు వెల్లడించారు.

అయితే తన ఫస్ట్ ఛాయిస్ నటనకేనని… ఈ తర్వాతే బిజినెస్ అని చెప్పారు. సినిమాలు, వ్యాపారాన్ని బ్యాలెన్స్ చేయడంలో తనకు ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపారు. మల్టీప్లెక్స్ థియేటర్లలో సినిమాలు చూడటం తనకు ఇష్టమని… ఇప్పుడు సొంత మల్టిప్లెక్స్ ఉండటం తనకు ఎంతో సంతోషాన్ని ఇస్తోందని చెప్పారు.