వారసత్వమో..వెనుక సపోర్ట్ ఉంటేనో సరిపోదు. ఆ రెండింటికి మించి ట్యాలెంట్ అనేది కూడా ఒకటి ఉంటాలి. ఏ రంగంలోనైనా ఇది కచ్చితంగా ఉండాల్సిన లక్షణం. మరీ ముఖ్యంగా సినిమా రంగంలో రాణించాలంటే ప్రతిభ తప్పనిసరి. వారసత్వం..సపోర్ట్ అనేది ఎంట్రీ వరకే పరిమితం. ఆ తర్వాత తనకు తానుగానే పైకి ఎదగాలి. తొలి సినిమా హిట్టైతే మరో అవకాశం వస్తుంది. ప్లాప్ అయితే ఛాన్స్ రావడానికి సమయం పడుతుంది. హిట్టైనా…ప్లాపైనా అన్నింటిని తట్టుకుని నిలబడ గలిగే శక్తి ఉండాలి. డబ్బు ఒక్కటే ఉంటే సినిమాల్లో రాణిచేద్దాం అన్నది కలే. ఎందుకంటే అలా వచ్చి ఫెయిలైన వాళ్లు చాలా మందే ఉన్నారు. ఫేమ్ కోసం పాకులాడి ఉన్న డబ్బును సమర్పించుకుని ఇంటిముఖం పట్టిన జాబితా తీస్తే పెద్దదే ఉంటుంది.
ఇప్పుడీ చర్చంతా దేనికంటే? మెగాస్టార్ చిన్నల్లుడిగా పరిశ్రమకి పరిచయమైన కళ్యాణ్ దేవ్ గురించి తెలిసిందే. ఓ పెద్దింటి కుటుంబానికి చెందిన కళ్యాణ్ దేవ్ చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజను రెండవ పెళ్లి చేసుకుని మెగా ఫ్యామిలీ ఇంట అల్లుడిగా అడుగుపెట్టాడు. అటుపై మెగా ఫ్యామిలీ అండదండలతో విజేత అనే సినిమా చేసాడు. ఇది చిరంజీవి నటించిన పాత సినిమా టైటిల్. మామ టైటిల్ నే ఎన్ క్యాష్ చేసుకునే ప్రయత్నం చేసాడు. ఇక ఫలితం దగ్గరకోస్తే నటుడిగా పాసయ్యాడని మార్కులు వేయించుకున్నాడు. అంతిమంగా సినిమా బాక్సాఫీస్ వద్ద నష్టాలే తెచ్చిపెట్టింది. మెగా ఇమేజ్ ఏమీ అక్కడ కలిసి రాలేదు.
ప్రస్తుతం మరో సినిమా చేస్తున్నాడు. అయితే పరిశ్రమ గురించి చిరంజీవి అల్లుడికి ముందే చెప్పారుట. తన పేరుతో అవకాశాలు వచ్చినా దాన్ని నిలబెట్టుకోవాల్సింది నువ్వేనని…తాను మాత్రం ఆ విషయంలో ఏమి చేయనని చిరంజీవి చెప్పారుట. అదీ మొదటి సినిమా వరకే తన పేరు పనికొస్తుందని తర్వాత అంతా కళ్యాణ్ దేవ్ ట్యాలెంట్ పైనే ఆధారపడి ఉంటుందని చిరంజీవి చెప్పినట్లు దేవ్ ఓ ఇంటర్వూలో రివీల్ చేసాడు. అయితే ఈ విషయాలన్ని ముందే తెలుసుకుని..కష్టపడే తత్వం ఉంది కాబట్టే సినిమాల్లోకి వచ్చానని కళ్యాణ్ దేవ్ తెలిపాడు. కష్టమో…సుఖమో అన్నీ ఇక్కడే పడాలని డిసైడ్ అయినట్లు దేవ్ స్పష్టం చేసాడు.