మ‌హేశ్ హీరోయిన్‌కి, ద‌ర్శ‌కుడికి డబ్బులు ఇవ్వలేదా?

‘బ్రహ్మోత్సవం’, ‘స్పైడర్’… రెండు డిజాస్టర్ల తరవాత మ‌హేశ్‌బాబుకి బ్లాక్‌బ‌స్ట‌ర్‌ హిట్టిచ్చిన దర్శకుడు కొరటాల శివ. మహేశ్ హీరోగా కొరటాల దర్శకత్వంలో డివివి దానయ్య నిర్మించిన ‘భరత్ అనే నేను’ ఈ వేసవికి వచ్చిన విజయవంతమైన సినిమాల జాబితాలో చోటు దక్కించుకుంది. వంద కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించినట్టు నిర్మాత పత్రికల్లో ప్రకటనలు సైతం ఇచ్చారు. అయితే… సినిమాలో హీరోయిన్‌గా నటించిన కియారా అడ్వాణీకి, దర్శకుడు కొరటాల శివకి నిర్మాత డివివి దానయ్య డబ్బులు ఇవ్వలేదట. ముందుగా మాట్లాడుకున్న పారితోషకాల్లో కొంత కోత విధించారని ఫిలింనగర్ గుసగుస. ఇండస్ట్రీలో కొరటాలకు అజాత శత్రువుగా మంచి పేరుంది. ఎవరితోనూ కయ్యానికి కాలు దువ్వే రకం కాదని ఆయన గురించి బాగా తెలిసినవాళ్ళు, తెలియనివాళ్ళు చెప్పే మాట. అటువంటి దర్శకుడు ఫోనులు చేస్తే నిర్మాత దానయ్య లిఫ్ట్ చెయ్యడం లేదట. సినిమా ప్లాప్ అయితే పరిస్థితి వేరు. హిట్టయిన సినిమాకి డబ్బులు ఎగ్గొట్టడం ఏంటోనని ఇండస్ట్రీలో మాట్లాడుకుంటున్నారు. కియారా ఆడ్వాణీ డబ్బులు మాత్రం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ చరణ్ సరసన ఆమె హీరోయిన్‌గా నటిస్తున్న సినిమాకి దానయ్య నిర్మాత. మొదటి సినిమా బాకీని ఈ సినిమా చేసేటప్పుడు వసూలు చేసుకునే వీలుంది. మరి, కొరటాల శివ సంగతి ఏమవుతుందో?