నాని ‘జెర్సీ’ ట్రైలర్ ఎలా ఉందంటే…

న్యాచురల్ స్టార్ నాని హీరోగా ‘మళ్ళి రావా’ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం జెర్సి. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకొంటోంది. నాని సరసన శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ నెల 19వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు.

ఈ నేపధ్యంలో ఈ చిత్రం ట్రైలర్ ని ఈ రోజు రిలీజ్ చేసారు. ఈ ట్రైలర్ కు అన్ని వర్గాల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.క్రికెటర్‌గా అర్జున్‌ మైదానంలోకి అడుగుపెట్టడం, తోటి ఆటగాళ్లతో గొడవపెట్టుకోవడం, శ్రద్ధతో ప్రేమలో పడటం తదితర సన్నివేశాలతో ట్రైలర్‌ మొదలైంది.

JERSEY Theatrical Trailer | Nani, Shraddha Srinath | Anirudh | Gowtam Tinnanuri

పదేళ్ల తర్వాత అర్జున్‌ (నాని) క్రికెట్‌కు దూరమై అటు ఉద్యోగం లేక ఇటు కుటుంబాన్ని నెట్టుకురాలేక సతమతమవడాన్ని చూపించారు. ‘పదేళ్ల క్రితం ఆగిపోయిన నా జీవితాన్ని మళ్లీ మొదలుపెడతా..’ అంటూ నాని ఉద్వేగంతో చెబుతున్న డైలాగ్‌ ట్రైలర్‌లో హైలైట్‌గా నిలిచింది.

ఇక ఈ మూవీ క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతోంది. కథ ప్రకారం 80-90 దశకం మధ్య జరిగిన కథ ఇది. 36 ఏళ్ళ వయసులో కొత్తగా ఏమీ చేయడానికి లేని ఒక యువకుడు 1996-97 రంజీ ట్రోఫీ ద్వారా ప్రూవ్ చేసుకుని తానేంటో మళ్ళి ప్రపంచానికి చాటాడమే కీలకాంశం. జెర్సిలో నాని పాత్ర పేరు అర్జున్ . అప్పట్లో సంచలన స్టార్ గా పేరున్న రమణ్ లాంబా జీవత కథగా ఈ సినిమా రూపొందుతోందని టాక్.

ఈ చిత్రంలో తండ్రికొడుకుల సెంటిమెంట్ హైలెట్ అయ్యేలా చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ‘ఇంత పెద్ద ప్రపంచంలో ఈ రోజు వరకు నన్ను జడ్జ్ చేయంది నా కొడుకు ఒక్కడు మాత్రమే’ అంటూ నాని చెప్పే డైలాగ్స్ సినిమా ఎలా ఉండబోతోంది అనే విషయంలో ఒక అంచనాకు వచ్చేలా చేస్తోంది.

ఇంతవరకూ చేయని పాత్రలో నాని కనిపించనున్నాడు. కథాకథనాలు .. పాత్రలను మలిచిన తీరు .. అనిరుధ్ సంగీతం ఈ సినిమాకి ప్రధాన బలంగా నిలవనున్నాయని అంటున్నారు. ఇది నాని కెరియర్లో చెప్పుకోదగిన చిత్రమవుతుందేమో చూడాలి.