ఇంకా సౌందర్యతో ఎఫైర్ అంటూ అడగటం ఏంటో…

సినీ నటి సౌందర్య మననుంచి భౌతికంగా దూరమై పద్నాగేళ్లు దాటింది. ఆమె చనిపోయి ఇంతకాలం అయినా సౌందర్య మన స్మృతిపథంలోంచి వెళ్లిపోలేందంటే కారణం, అందం… అభినయం…ఆహార్యం! పదహారణాల తెలుగమ్మాయిలా అనిపించే సౌందర్య బీజేపీ తరపున చెన్నమనేని విద్యాసాగర్ రావు కోసం ప్రచారం చేసేందుకు బెంగళూరు నుంచి కరీంనగర్ కి హెలికాప్టర్ లో వస్తూ ప్రమాదవశాత్తు అసువులు బాసింది. అయితే ఆమె మృతి చెందినా మీడియా వాళ్లు మాత్రం ఆమెను క్యాష్ చేసుకోవటం మానలేదు.

సినీ పరిశ్రమ చుట్టూ ఎప్పుడూ కొన్ని గాసిప్స్, కొన్ని నిజాలు తిరుగుతూంటాయి. వాటిల్లో ఏది నిజమో..ఏది అబద్దమో తేల్చుకోలేనంతగా కలిసిపోతాయి. దాంతో జనం తమకు నచ్చిన విధంగా నచ్చిన విషయాలు తీసుకుని వాటి చుట్టూ కథలు అల్లుకుంటూంటారు. అలాంటివాటిల్లో ఒకటి సౌందర్య, జగపతిబాబు ఎఫైర్.

అప్పట్లో .. జగపతిబాబు .. సౌందర్య కలిసి కొన్ని సినిమాల్లో హీరో,హీరోయిన్స్ గా నటించారు. ముఖ్యంగా దొంగాట చిత్రం ఘన విజయం సాధించింది. ఈ నేపధ్యంలో వీరిద్దరూ ప్రేమలో పడ్డారనీ .. పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారనే వార్తలు మీడియాలో షికారు చేశాయి. ఆ విషయమై ఆయన్ని గతంలో ఇంటర్వూలల్లో ప్రస్తావించారు. అయితే సౌందర్య మరణం తర్వాత ఆ విషయాలుపై ఆసక్తి మీడియాకు తగ్గిపోయింది. కానీ రీసెంట్ గా మరోసారి ఈ ప్రస్దావన వచ్చింది.

అప్పట్లో వచ్చన ఈ రూమర్స్ లాంటి వార్తలు గురించిన ప్రస్తావన ఓ యూట్యూబ్ ఛానెల్  ఇంటర్వ్యూలో తీసుకువచ్చారు. దానికి జగపతిబాబు స్పందిస్తూ .. “అవును..నాకు పరిచయమైన వాళ్లతో నేను క్లోజ్ గానే వుంటాను. అలా ఉండటం వలన వాళ్ళేం అనుకుంటారో .. వీళ్ళేం అనుకుంటారోనని ఆలోచిస్తూ కూర్చోను. ఎవడేమనుకుంటే మనకేంటి .. పనిలేనివాళ్లు వాళ్ల ఎంటర్టైన్ మెంట్ కోసం ఎన్నో అనుకుంటారు. ఎవరెవరు ఏం చేస్తున్నారన్నది నేను పట్టించుకూంటూ కూర్చూంటే మన జీవితం ముందుకు వెళ్లదు.

ఇక సౌందర్య ది చాలా ట్రెడిషనల్ ఫ్యామిలీ. సౌందర్య .. ఆమె సోదరుడు అమర్ నాకు మంచి స్నేహితులు. నేను వాళ్ల ఇంటికి తరుచూ వెళుతూ ఉండేవాడిని. అది అందరికీ తెలుసు. అయితే ఒకసారి నేను డైరక్టర్ కోదండరామిరెడ్డి గారిని రిసీవ్ చేసుకోవడానికి రైల్వే స్టేషన్ కి వెళితే అదే ట్రైన్ లో సౌందర్య దిగింది. దాంతో ఆమె కోసం స్టేషన్ కి వచ్చినట్టు మీడియావాళ్లు రాసేశారు. ఇలా అనుకోకుండా జరిగిన కొన్ని సంఘటనల వలన అలా ప్రచారం జరిగిందంతే…అంతకు మించి మా మధ్య మీరు అనుకునే రిలేషన్ ఏదీ లేదు” అని చెప్పుకొచ్చారు.