‘గీతగోవిందం’ నిర్మాతపై ఐటీ దాడి: వచ్చిందెంత… కట్టిందెంత?

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా పరశురాం దర్శకత్వంలో తెరకెక్కిన ‘గీత గోవిందం’ బాక్సాఫీసు వద్ద సంచలనాలు నమోదు చేసింది. స్టార్ హీరోల సినిమాలకు ఏ మాత్రం తీసిపోకుండా భారీ వసూళ్లు సాధించి రికార్డ్ లు క్రియేట్ చేసింది. ఈ నేపధ్యంలో ‘గీతగోవిందం’ సినిమా నిర్మాతలపై ఆదాయపు పన్ను శాఖ అధికారుల దృష్టి పడింది. అందుతున్న సమాచారం మేరకు శుక్రవారం సినిమా నిర్మాతల కార్యాలయాలకు వచ్చిన ఐటీ అధికారులు సినిమా కలెక్షన్లు, చెల్లించిన పన్ను వివరాలను పరిశీలించారు.

హైదరాబాద్, బంజారాహిల్స్‌ లోని ‘జీఏ 2 పిక్చర్స్‌’ కార్యాలయానికి వచ్చిన ఐటీ యూనిట్‌ – 14 బృందం, వసూళ్ల రికార్డులను పరిశీలించింది. ఈ సినిమా సుమారు రూ. 130 కోట్ల వరకూ వసూలు చేసివుంటుందని భావిస్తున్న అధికారులు, ఆ మేరకు పన్నులను చెల్లించారా? లేక ఏమైనా ఎగ్గొట్టారా? అసలు సినిమా వసూళ్లు ఎంత? అన్న వివరాల లెక్కలు తీస్తూ, నిర్మాణ సంస్థ యాజమాన్యంపై ప్రశ్నల వర్షం కురిపించారు.

‘జీఏ 2 పిక్చర్స్‌’ గతంలో తీసిన రెండు సినిమాల వివరాలు, వాటి ఆదాయాలను, లెక్కలను కూడా పరిశీలించారు. కార్యాలయ సిబ్బందితో పాటు నిర్మాణ సంస్థ యాజమాన్యాన్ని అధికారులు ప్రశ్నించారు. గీత గోవిందం సినిమాకు చెందిన నిర్మాతలు ఆదాయ పన్ను ఎంత కట్టారు అనే విషయం తెలియాల్సి ఉంది.