లాక్ డౌన్ నేపథ్యంలో వలస కూలీల ఇబ్బందులు మాటల్లో చెప్పలేనివి. బ్రతుకు జీవుడా అంటూ వందలు వేల కిలోమీటర్లు బరువులేసుకుని పిల్లలు.. కుటుంబంతో నడుచుకుంటూ వస్తున్నారు. జేబులో డబ్బుల్లేక.. తిండి లేక..నిద్రలేక…మంచి నీళ్లు లేక మార్గ మధ్యలోనే చనిపోవడం చూస్తున్నదే. ఇలాంటి వెతలు వందేళ్లకు ఒక్కసారైనా చూడలేం.. అన్నంతగా సన్నివేశం చూపిస్తోంది. అయ్యో పాపం అనుకోవడం తప్ప సామాన్యుడు ఏం చేయగలడు. ఇప్పటికే చలించిపోయిన ఏపీ ప్రభుత్వం తక్షణం వలస కార్మికులకు అన్ని రకాల వసతులు కల్పించాలని నిర్ణయించింది. రాష్ట్ర సరిహద్దుల వరకూ బస్సులు వేసి పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చేవారిని తరలించాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు.
అలాగే బాలీవుడ్ నటుడు సోనుసూద్ మానవతా ధృక్ఫధంతో తానే స్వయంగా బస్సులు ఏర్పాటు చేసి కూలీలను స్వగ్రామాలకు తరలిస్తున్నాడు. ఇప్పటికే మహరాష్ట్ర నుంచి కర్ణాటకకు సొంత డబ్బుతో బస్సులు వేసి చాలా మంది కూలీలను తరలించాడు. తాజాగా ఉత్తర ప్రదేశ్ అనుమతితో లక్నో, హర్దోయి, ప్రతాఫ్ ఘర్, సిద్ధార్థ్ నగర్ కూలీల కోసం మరికొన్ని బస్సులు ఏర్పాటు చేసాడు. అలాగే బీహార్, జార్ఖాండ్ రాష్ట్రాలకు ప్రత్యేకంగా కొన్ని బస్సులు అద్దెకు తీసుకుని కార్మికులను తరలించే కార్యక్రమం పెట్టుకున్నాడు. రీల్ లైఫ్ లో కఠినమైన విలన్ అయినా..రియల్ లైఫ్ లో మాత్రం కార్మికుల పాలిట రియల్ హీరోగా నిలిచాడు.
అంతక ముందు లాక్ డౌన్ తో ఇబ్బందులను గుర్తించిన సోనుసూద్ భారీగా విరాళం అందించాడు. మరి కోట్లాది రూపాయలు సంపాందించే టాలీవుడ్ టాప్ స్టార్లు అంతా ఏం చేస్తున్నారంటే? వాళ్లు కూడా సామాన్యుల్లా…నిర పేదల్లా అయ్యో పాపం అంటున్నారు! తప్ప వలస కూలీల విషయంలో జేబులో నుంచి మాత్రం రూపాయి తీయలేదు. అవును ఇది నిజం. లాక్ డౌన్ ప్రకటించిన వెంటనే మెగాస్టార్ చిరంజీవి సీసీసీ ఏర్పాటు చేసి కొంత విరాళం సేకరించి సినిమా కార్మికుల్ని ఆదుకున్న మాట వాస్తవం. ప్రభుత్వానికి కొంత విరాళంగా అందించిన మాట నిజం. ఆయన స్ఫూర్తితో పలువురు పలు రకాలుగా సాయం చేసినా.. ఇంకా ఎందరో స్టార్లు స్పందించాల్సి ఉంది. అయితే వలస కూలీల వెతలు మాత్రం టాలీవుడ్ లో ఏ స్టార్ హీరోకి కనీస మాత్రంగానైనా పట్టలేదు. కనీసం ఇప్పటివరకూ సాయం చేయని వారైనా స్పందిస్తే బావుండేదన్న భావన వ్యక్తమవుతోంది.
ఒక్కొక్క సినిమాకు 15 కోట్లు..25 కోట్లు…25 కోట్లు తీసుకుంటున్నారు గానీ..కష్టాల్లో ఉన్న వలస బ్రతుకులను ఆదుకోవడానికి మాత్రం ఎవరి చేయి ముందుకు రావడం లేదు. బీసీ ఏరియాల్లో సినిమా ఆడితే కాలరెగరేసి జబ్బలు చరిచే ఈ హీరోలంతా ఇప్పుడేమయారు. కనీసం ఒక్కరు కూడా సోషల్ మీడియా లో అయ్యో పాపం అన్న పాపాన కూడా పోలేదు. ముఖ్యంగా టాలీవుడ్ హీరోలపై ఉత్తరాంధ్ర జిల్లాల వలస వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ నుంచి ఎంతో మంది హైదరాబాద్ వలస వచ్చి చిన్న చిన్న కూలి నాలి చేసుకుని బ్రతుకులు ఈడుస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా వాళ్లంతా ఇప్పుడు నడక దారిన స్వస్థలాలకు చేరుకుంటున్నారు. కనీసం ఉత్తరాంధ్ర జిల్లాల వారి కోసమైనా మన హీరోలు స్పందించకపోవడం శోచనీయం.
సోను సూద్ టాలీవుడ్ స్టార్ హీరోలందరికంటే తక్కువ పారితోషికం తీసుకునే నటుడు. తెలుగు, హిందీ సినిమాల్లో విలన్ పాత్రలు వేస్తుంటాడు. మరీ అంత బిజీ స్టార్ కూడా కాదు. కానీ టాలీవుడ్ లో ఏ హీరోకి లేని పెద్ద మనసు ఈ రియల్ హీరోకి ఉంది. ఇప్పటికైనా ఈ విషయంలో సోనుసూద్ లాంటి వాళ్లని ఆదర్శంగా తీసుకోవాలని ఆశిద్దాం.