ఫ్లాపుల‌తో ప‌ని లేకుండా ఛాన్స్ కొట్టేస్తున్నారు!

క‌థ కంటెంట్ కి ప్రాధాన్య‌త పెరిగిన నేటి ట్రెండ్ లో కొంద‌రు ఫ్లాప్ ద‌ర్శ‌కుల‌కు అవ‌కాశాలు రావ‌డం అన్న‌ది ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మే. ఒక‌సారి ఫ్లాప్ డైరెక్ట‌ర్ అన్న ముద్ర ప‌డ్డాక తిరిగి అవ‌కాశం ఇవ్వ‌డం అంటే అది చాలా క‌ష్టం. ఎన్ని హిట్లు ఉన్నా స్టార్లు అవ‌కాశం ఇవ్వాలంటే చాలానే ఆలోచిస్తుంటారు. కానీ ఇటీవ‌లి కాలంలో ట్రెండ్ మారింది. మెగాస్టార్ చిరంజీవి- విక్ట‌రీ వెంక‌టేష్ – బాల‌కృష్ణ – నాగార్జున లాంటి హీరోలు ఫ్లాప్ డైరెక్ట‌ర్ల‌ను కూడా ఎంక‌రేజ్ చేస్తుండ‌డం ఆస‌క్తిక‌రం.

ఇప్ప‌టికిప్పుడు మెగాస్టార్ చిరంజీవి .. బాబీని పిలిచి ఓ రీమేక్ ఆఫ‌ర్ ఇవ్వ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. మ‌ల‌యాళ బ్లాక్ బ‌స్ట‌ర్ లూసీఫ‌ర్ కి రీమేక్ స్క్రిప్టును రాయాల్సిందిగా బాబీకి ఆఫ‌ర్ చేశారు చిరు. బాబీతో పాటు ప‌లువురు ద‌ర్శ‌కుల పేర్లు వినిపించినా చివ‌రికి తాను వినిపించిన థీమ్ లైన్ మెగాస్టార్ ని ఇంప్రెస్ చేసింద‌ట‌. చిరు ప్ర‌స్తుతం ఆచార్య చిత్రంలో న‌టిస్తున్నారు. త‌దుప‌రి ఈ రీమేక్ లో న‌టించే వీలుంద‌ని చెబుతున్నారు. ఇక బాబీ ట్రాక్ రికార్డ్ ఇటీవ‌ల ఏమంత బాలేదు. `వెంకీ మామ‌`తో హిట్టు కొట్టినా కానీ కంటెంట్ ప‌రంగా సోసోనే అని క్రిటిక్స్ విమ‌ర్శించారు. అంత‌కుముందు బాబీని ప‌రాజ‌యాలు ఇబ్బంది పెట్టాయి. అందుకే చిరు ఆఫ‌ర్ ఇవ్వడం ఆస‌క్తిక‌రం.

న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ సైతం ఒక ఫ్లాప్ డైరెక్ట‌ర్ కే అవ‌కాశం ఇచ్చారు. సింహా- లెజెండ్ లాంటి రెండు హిట్లు త‌న‌కు ఇచ్చినా.. విన‌య విధేయ రామ లాంటి డిజాస్ట‌ర్ మూవీ తీసిన బోయ‌పాటిపై తీవ్ర విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. విన‌య విధేయ రామ మేకింగ్ పై వెట‌కారాలు కామెడీలు తెలిసిందే. ఇక‌పోతే ఫ్లాపుల్లో ఉన్న వెట‌ర‌న్ బి.గోపాల్ కి బాల‌య్య ఛాన్సిస్తున్నార‌ని ఇటీవ‌ల ప్ర‌చార‌మైంది. అలాగే విక్ట‌రీ వెంక‌టేష్ క‌థానాయ‌కుడిగా త‌మిళ బ్లాక్ బ‌స్ట‌ర్ అసుర‌న్ ని నార‌ప్ప టైటిల్ తో రీమేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అంత‌కుముందు ఫ్లాపులు ఉన్నా శ్రీ‌కాంత్ అడ్డాల‌కు వెంకీ ఛాన్సిచ్చారు. నార‌ప్ప పోస్ట‌ర్ వెంకీ అభిమానుల్లోకి దూసుకెళ్లిన సంగ‌తి తెలిసిందే. కింగ్ నాగార్జున త‌న ఆస్థాన విధ్వాంసుడు ఆర్జీవీకి ఇదివ‌ర‌కూ ఛాన్సిచ్చిన సంగ‌తి తెలిసిందే. త‌న కెరీర్ బెస్ట్ డిజాస్ట‌ర్ ని ఇచ్చిన ఘ‌న‌త ఆర్జీవీకే చెల్లింది. అంత‌కుముందు ప‌ర‌మ చెత్త సినిమాలు తీసిన రామ్ గోపాల్ వ‌ర్మ‌కు ఒక స్నేహితుడిగా కింగ్ ఈ ఆఫ‌ర్ ని ఇచ్చారు. వ‌రుస డిజాస్ట‌ర్ల‌తో రికార్డ్ కొట్టేసిన పూరీకి ఫ్లాపుల్లోనే ఉన్న రామ్ అవ‌కాశం ఇచ్చి హిట్టు కొట్టేయ‌డం అన్న‌ది ఓ రికార్డ్ అనుకుంటే… హిట్టు తీసాడు అన్న పేరున్నా వంశీ పైడిప‌ల్లి లాంటి ద‌ర్శ‌కుడు క‌థ చెబుతానంటే అవ‌కాశం ఇవ్వ‌ని హీరోలు ఉన్నారు. మ‌రి అలాంట‌ప్పుడు ఫ్లాపులు తీసి అవ‌కాశాలు ప‌ట్టేస్తున్న వీళ్లంతా గ్రేట్ అనే పొగ‌డాల్సి ఉంటుంది. జాక్ పాట్ మీనింగ్ ఏంటో ఇప్ప‌టికైనా అర్థ‌మైందా?