“పెళ్లిసందడి” లో తండ్రీకొడుకులు !

పెళ్లిసందడి .. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన బిగెస్ట్ బ్లాక్ బ్లాస్టర్ మూవీ. అప్పటివరకు చిన్నచిన్న వేషాల్లో కనిపించిన శ్రీకాంత్‌తో పరిమిత బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించింది. కీరవాణి సంగీతం సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది. ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ తో శ్రీకాంత్ మ‌ళ్లీ వెన‌క్కి తిరిగి చూసుకోకుండా వ‌రుస సినిమాల్లో న‌టిస్తూ టాప్ హీరోగా ప్రేక్ష‌కుల మ‌న్న‌న‌లు పొందాడు.

ఇదిలా ఉంటే .. అదే క్లాసిక్ టైటిల్‌ తో శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా రాఘవేంద్రరావు ఓ సినిమా తీస్తున్నట్లు ప్రకటించారు.ఆయన దర్శకత్వ పర్యవేక్షణలో ఈ చిత్రాన్ని నూతన దర్శకురాలు గౌరి రోనక్‌ తెరకెక్కించనున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్‌కు సంబంధించి పనులు జరుగుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో శ్రీకాంత్ నటించనున్నట్లు తెలుస్తోంది. కథను మలుపు తిప్పే కీలక పాత్రలో ఆయన కనిపించబోతున్నారట. ఆ పెళ్లి సందడి తండ్రికి తిరుగులేని స్టార్ డమ్ అందిస్తే , ఈ పెళ్లి సందడి కొడుకుకి మంచి స్టార్ ఇమేజ్ తెచ్చుపెడుతుంది అని అనుకుంటున్నారు. ఇక శ్రీకాంత్ కూడా కీలక పాత్ర లో నటిస్తుండటం తో సినిమా పై అంచనాలు మరింతగా పెరిగాయి.