ఇండియన్ సూపర్ హీరో ఎవరు? అంటే .. ఎలాంటి తడబాటు లేకుండా హృతిక్ రోషన్ పేరు చెప్పేస్తారు ఎవరైనా. అతడు నటించిన `క్రిష్` సిరీస్ బాలీవుడ్ లో అత్యంత ప్రాచుర్యం పొందిన సూపర్ హీరో ఫ్రాంచైజీగా నిలిచింది. ఈ సిరీస్ లో నాలుగో సినిమాని అత్యంత భారీగా తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే `క్రిష్ 4` పై చాలా ఊహాగానాలు సాగాయి. లాక్ డౌన్ వల్ల రోషన్స్ కి చాలా సమయం కలిసొచ్చిందట.
“రాకేశ్ జీ- హృతిక్.. వారి రచయితల బృందంతో కలిసి క్రిష్4 ను ఎలా ముందుకు తీసుకెళ్లాలి“ అనే దానిపై సీరియస్ గానే కసరత్తు చేశారట. చివరకు ఒక లైన్ నచ్చి దానిని లాక్ చేశారని తెలుస్తోంది. `జాదూ` తిరిగి వస్తాడు అంటే అతడికి బలం విలువ ఉంటుంది“ అన్నదే ఆ లైన్. ఈ సిరీస్ లో ఇప్పటికే రోహిత్ మెహ్రా మరణించడంతో.. క్రిష్ కు ప్రత్యేక శక్తుల్ని బహుమతిగా ఇచ్చిన గ్రహాంతరవాసులకు పరిచయం చేయడానికి ఇదే సరైన సమయం అని రచయితల టీమ్ భావించిందట. ఈ ఐడియా తండ్రి కొడుకులు ఇద్దరికీ నచ్చి వెంటనే ఓకే చెప్పేశారట. కథలో భాగంగా 16 సంవత్సరాల తరువాత జాదూను తిరిగి భూమికి తిరిగి వస్తాడని హృతిక్ తెలిపారు.
రాకేశ్- హృతిక్ రోషన్ స్క్రిప్ట్ కోసం విస్తృతంగా ఆలోచిస్తున్నారట. సాధ్యమైనంత ముందుగానే సినిమాను ప్రారంభించాలని భావిస్తున్నారు. ఇప్పటికే పలువురు హాలీవుడ్ టెక్నీషియన్లతో సినిమా స్కేల్.. విజువల్స్ .. ఇతర సాంకేతిక అంశాల గురించి చర్చిస్తున్నారు. క్రిష్ 3 చిత్రం 2013 లో రిలీజైంది. అందులో హృతిక్ తో పాటు ప్రియాంక చోప్రా- కంగన- వివేక్ ఒబెరాయ్ ప్రధాన పాత్రల్లో నటించారు. నాలుగో భాగంలోనూ ప్రామిస్సింగ్ గా ఉండే కాస్టింగ్ ని ఎంపిక చేయాలన్న ఆలోచనతో ఉన్నారట.