ఆర్జీవీ బరి తెగింపుడు బూతును ఇంకెన్నాళ్లు భ‌రించాలి?

                           చెత్త డైరెక్ట‌ర్ అంటూ దారుణంగా తిట్టేస్తున్న‌ నెటిజ‌న్

డిజిట‌ల్లో బూతు కంటెంట్ కి సెన్సార్ అన్న‌దే లేక‌పోవడం టీనేజీ కుర్రాళ్ల‌కు.. తెలుగు య‌వతకు పెను ముప్పుగా మారిందా? జ‌నం జేబుల్లో సొమ్ము కొంద‌రు బూతు సినిమాలు తీసే డ‌ర్టీ మేక‌ర్స్ పాల‌వుతోందా? అంటే అవున‌నేందుకు ప్ర‌త్య‌క్ష సాక్ష్యాల్ని చూపించాల్సిన ప‌నే లేదు. జీఎస్టీ.. క్లైమాక్స్ .. న‌గ్నం అంటూ బూతు సినిమాలు తీసిన ఆర్జీవీ ఇప్పుడు `థ్రిల్ల‌ర్` అంటూ మ‌రో ఎర‌ను వ‌దులుతున్నాడు. న‌గ్నం పేరుతో తెలుగ‌మ్మాయి అందాల్ని ఎర వేసిన ఆర్జీవీ.. థ్రిల్ల‌ర్ పేరుతో అప్స‌ర‌రాణి అనే ఒడిస్సా యువ‌నాయిక న‌గ్న అందాల్ని ఎన్ క్యాష్ చేసుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నాడని తీవ్ర విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

ఆగ‌స్టు 9న థ్రిల్ల‌ర్ మూవీని ఆర్జీవీ రిలీజ్ చేసేందుకు సిద్ధ‌మ‌వుతూ చేస్తున్న ప్ర‌చారార్భాటం చూస్తుంటే ఔరౌరా! అంటూ ముక్కున వేలేసుకోని వాళ్లే లేరు. లేటెస్టుగా ఆర్జీవీ ఓ ఆఫ‌ర్ కూడా ఇచ్చాడు. రూ.200 పెట్టి టిక్కెట్టు కొనుక్కుంటే త‌న‌ను అలాగే అప్స‌ర‌ను క‌లిసే అవ‌కాశం క‌ల్పిస్తాడ‌ట‌. అయితే ఈ ఆఫ‌ర్ ని చూసి జ‌నం అస‌హ్యించుకుంటున్న వైనం సోష‌ల్ మీడియాల సాక్షిగా బ‌య‌ట‌ప‌డుతోంది. ఇక నెటిజ‌నులు ఆర్జీవీపై ఓ రేంజులోనే ఫైర‌వుతున్నారు. ఇలాంటి చెత్త డైరెక్ట‌ర్ వేరొక‌రు లేనే లేర‌న్న‌ది సాంప్ర‌దాయ యువ‌త‌రం భావ‌న‌. ఒక నెటిజ‌నుడు అయితే యూజ్ లెస్ డైరెక్ట‌ర్.. చెత్త సినిమాలు తీస్తాడంటూ ఆర్జీవీని తిట్టేసిన తీరు చూస్తుంటే యువ‌త‌రం కూడా అంత‌గా విసిగిపోయిందా? అనిపించ‌క మాన‌దు.

నిరంత‌రం టీఆర్పీల కోసం పాకులాడే కొన్ని మీడియాల‌ చేత‌కానిత‌నాన్ని లేదా వ్యూస్ కోసం క్లిక్ ల కోసం చెత్త ప‌నుల‌కు పాల్ప‌డే కొన్ని యూట్యూబ్ చానెళ్లు లేదా మీడియాల్ని అడ్డం పెట్టుకుని ఆర్జీవీ ప్ర‌చారం ఊద‌ర‌గొట్టేస్తూ బూతు సినిమాల్ని ప్ర‌మోట్ చేసుకుని సంపాదిస్తున్నాడ‌న్న విమ‌ర్శ‌లు ఇప్ప‌టికే వేడెక్కిస్తున్నాయి. వీట‌న్నిటి న‌డుమ ఇప్ప‌డు థ్రిల్ల‌ర్ అనే బోల్డ్ మూవీని రిలీజ్ చేస్తూ మ‌రోసారి తిట్లు చీవాట్లు తింటున్నాడు.

ఇంత‌కుముందు ఏటీటీలో రిలీజ్ చేసిన `ప‌వ‌ర్‌స్టార్` మూవీ డ‌బ్బు తెచ్చినా.. అంతే చెడ్డ పేరును కూడా తెచ్చింది. ఇప్పుడు థ్రిల్ల‌ర్ అంటున్నా‌డు. ఆ త‌ర్వాత మ‌ర్డ‌ర్ అంటాడు. ఇంకా అర‌డ‌జ‌ను పైగా సినిమాల్ని ప్రచారార్భాటంతో రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు.

ఓవైపు స్వీయ ప్రాప‌కం కోసం యాంక‌ర్ల‌ను టీజ్ చేస్తూ చానెల్ లైవ్ లోనే వెట‌కారాలాడుతూ ఆర్జీవీ వేస్తున్న వెకిలి వేషాల‌పై ఇప్ప‌టికే తీవ్ర విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. బాహుబ‌లి లాంటి పాన్ ఇండియా సినిమా తీసి వ‌ర‌ల్డ్ వైడ్ టాలీవుడ్ గొప్ప‌త‌నాన్ని చాటిన ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్.ఎస్. రాజ‌మౌళి ని చూసి ఈ వెట‌రన్ డైరెక్ట‌ర్ ఎప్ప‌టికి నేర్చుకుంటాడు? అన్న ప్ర‌శ్న ప‌దే ప‌దే ఎదుర‌వుతూనే ఉన్నా అదేమీ ప‌ట్ట‌న‌ట్టే ఇలా బూతును విశృంఖ‌ల‌త‌ను ఎందుక‌ని ఆశ్ర‌యిస్తున్నారు?  చీప్ ట్రిక్స్ తో మార్కెటింగ్ ప్లాన్ ఎందుకు చేస్తున్నారు? అన్న విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. నిజాల్ని గ్ర‌హించ‌క‌ ఈ బూతును ఇంకెన్నాళ్ల‌ని యూత్ భ‌రిస్తారో చూడాలి.