నడిగర సంఘం ఎన్నికల వివాదం గురించి తెలిసిందే. రెండు వర్గాల మధ్య గొడవలు కాస్తా కోర్టుల పరిధికి చేరుకున్నాయి. విశాల్- కార్తీ- నాజర్ వర్గంపై ప్రత్యర్థులు కత్తి కట్టి ఎన్నికల్ని అడ్డుకున్న సంగతి తెలిసిందే. గతేడాది జూన్ లో జరిగిన నడిగర్ సంఘం ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని.. ఓటు హక్కును రద్దు చేయడంతో పాటు.. గడువు పూర్తయినా ఎన్నికలు జరిపారని అందుకే ఎన్నికలు బహిష్కరించాలని ప్రత్యర్థి వర్గం సభ్యులు బెంజిమెన్- ఎలుమళై మద్రాసు హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. దీంతో హైకోర్టు లెక్కింపుని నిలిపివేయాలని ఆదేశాలిచ్చింది. కానీ కార్తీ, విశాల్ ఎలాంటి తప్పిదాలు జరగలేదని.. అవకతవకలు లేకుండా సక్రమంగానే ఎన్నికలు జరిగాయని..ఓట్ల లెక్కింపు అనుమతి ఇవ్వాలని రీ పిటీషన్ దాఖలు చేసింది.
తర్వాత హైకోర్టు దీనిపై ఓ అధికారిని నిమియమించింది. ఈ అధికారి నియమకాన్ని వ్యతిరేకించి విశాల్ వర్గం మరో పిటీషన్ దాఖలు చేసింది. ఇలా పలు కారణాల వల్ల గతేడాది జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగలేదు. తాజాగా హైకోర్టు శుక్రవారం అన్ని పిటీషన్లపై తుది తీర్పును వెలువరించింది. గడువు పూర్తయిన తర్వాత జరిగిన ఎన్నికలు చెల్లవని.. మళ్లీ కొత్తగా ఎన్నికలు నిర్వహించాలని..అదీ మూడు నెలల్లో ఆ ప్రక్రియ పూర్తి చేయాలని కోర్టు ఆదేశించింది. దీంతో విశాల్ వర్గం ఒక్కసారిగా కంగు తింది.
ప్రత్యర్థులకు ధీటుగా చేసిన ప్రయత్నాలేవి ఫలించకపోవడంతో విశాల్ వర్గం ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటోందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది. హైకోర్టు ఆదేశాలను పాటిస్తారా? సుప్రీం కోర్టును ఆశ్రయిస్తారా? అన్న దానిపై సందిగ్ధత నెలకొంది. విశాల్ తెలుగు వాడు కావడంతోనే భాషాబేధంతో కొంత మంది తమిళులు విశాలపై ఇలాంటి కుట్రలు పన్నుతున్నారన్న వాదనా ఒక వర్గం వినిపిస్తోంది. అయితే కోర్టుల పరిధిలో నెగ్గుకు రావడంలో విశాల్ వర్గం తడబాటుకు గురవుతోంది.