ఓవైపు సినిమా థియేటర్లు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేయనుంది. సినిమా హాళ్లు.. జిమ్ లకు అనుమతులిచ్చేస్తూ కేంద్రం ప్రకటన జారీ చేయనుంది. అయితే దాంతో పాటే కొన్ని మార్గదర్శకాల్ని రూపొందిస్తున్నారని సమాచారం ఉంది. సగం సీట్లు ఖాళీగా ఉంచి నిరంతరం శానిటైజ్ చేస్తూ థియేటర్ టాయ్ లెట్లు మెయింటెయిన్ చేస్తూ ఇంకా చాలానే రూల్స్ పాటించాలని చెప్పబోతున్నారు.
అయితే థియేటర్లు ఓపెన్ చేసినా జనం వస్తారా? అన్న చర్చ తాజాగా టాలీవుడ్ సర్కిల్స్ ని వేడెక్కిస్తోంది. ఓ ప్రముఖ నిర్మాతను ఇదే విషయమై తెలుగు రాజ్యం ప్రశ్నిస్తే ఆయన నుంచి వచ్చిన సమాధానం “ఛాన్సే లేదు.. మా సినిమాని రిలీజ్ చేయలేం… ఎందుకంటే హీరో ఒప్పుకోడు“ అని తెలిపారు. ఇన్నాళ్లు ఓటీటీ రిలీజ్ అంటేనే హీరోలు అంగీకరించడం లేదని విన్నాం. కానీ ఇప్పుడు థియేట్రికల్ రిలీజ్ కి కూడా ఒప్పుకోవట్లేదట. ఈ సన్నివేశం ఎంతో వింతైనది అని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.
అయితే హీరోలు అంగీకరించకపోవడానికి కారణం ఏమిటి? అంటే.. ఇంకా కరోనా మహమ్మారీ భయాందోళనలు ప్రజల్లో ఎంతమాత్రం తగ్గకపోవడమే. భయాలు పోతేనే థియేటర్ల వైపు అడుగులు పడతాయి. అంతేకానీ.. థియేటర్లు తెరిచేస్తే జనం వచ్చేయరు! అన్నది వారి వెర్షన్. నిజమే ఓవైపు ఏపీలో లక్ష పాజిటివ్ కేసులు.. తెలంగాణలో ఇంచుమించు లక్షకు చేరువలో కేసులు చూస్తుంటేనే భయోత్పాతం కనిపిస్తోంది.
రోజుకు 5000-10,000 పాజిటివ్ కేసులు నమోదవుతుంటే ప్రజల గుండెలు గుభేల్మంటున్నాయి. ఈ సంఖ్య మున్నుందు ఇంకా ఇంకా పెరిగే అవకాశమే కనిపిస్తోంది కానీ.. తగ్గడం లేదు. దీనికి తోడు ఐసిస్ తీవ్రవాదులు భారతదేశంలో అల్ల కల్లోలం సృష్టించేందుకు కరోనా అంటించేందుకు రంగ ప్రవేశం చేశారన్న వార్తలు ప్రకంపనాలు రేపుతున్నాయి. అందుకే ఇప్పట్లో థియేటర్లు తెరవడం కష్టమేనన్నది ఊహించలేని పరిస్థితి. ఎగ్జిబిషన్ రంగం దాంతో పాటే టాలీవుడ్ పరిస్థితి ఆగమ్య గోచరంగా మారింది. మరోవైపు షూటింగుల్లేవ్. వ్యాక్సిన్ లేదా టీకా వచ్చే వరకూ ఈ పరిస్థితి ఇలానే ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.