ఇప్పుడు హీరోలందరి లక్ష్యం ఒకటే..తమిళ, మళయాళ మార్కెట్లు కూడా సొంతం చేసుకోవాలని. బాహుబలి లాంటి హిట్ తమ ఖాతాలో పడాలి. అయితే అందరికి ఆ కోరిక తీరదు..లక్ష్యం నెరవేరదు. అందుకోసం…అఖిల్ కూడా తమిళంలో మార్కెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అదేదో ఓ హిట్ సినిమాతో లాంచ్ అయితే బాగుండేది కానీ..తన కెరీర్ లో ప్లాఫ్ గా మిగిలిన చిత్రంతో తమిళంలోకి వెళ్ళటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
అఖిల్ హీరోగా రూపొందిన ‘హలో’ చిత్రం తమిళంలోనూ డబ్బింగ్ అయ్యింది. తమిళంలో కూడా నాగార్జునే నిర్మించడం విశేషం. ఇందులో దర్శకుడు ప్రియదర్శన్ కుమార్తె కల్యాణి హీరోయిన్‌గా నటించిన విషయం తెలిసిందే. విక్రం కె.కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. రమ్యకృష్ణ ముఖ్యపాత్ర పోషించారు. జగపతిబాబు, అజయ్, సత్యకృష్ణ, వెన్నెల కిశోర్‌లు ఇతర తారాగణం. అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చారు. శ్రీలక్ష్మి జ్యోతి క్రియేషన్స్ బ్యానరుపై ఏఎన్ బాలాజీ ఈ చిత్రాన్ని తమిళంలో విడుదల చేస్తున్నారు.
ఈ సినిమా గురించి అఖిల్ మాట్లాడుతూ ‘నేను బాలనటుడిగా నటించిన ‘చుట్టి కుళందై’కి మంచి ఆధరణ ఇచ్చిన తమిళ ప్రేక్షకులపై నాకు అమితమైన గౌరవముంది. మా అమ్మ అమలకు తమిళంలోనే ఎక్కువ ఆదరణ లభించింది. ఇప్పుడు ‘హలో’ చిత్రంతో తమిళంలో పరిచయమవడం ఆనందంగా ఉంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం తమిళంలోనూ విజయం సాధిస్తుందని నమ్ముతున్నా. డిసెంబరులో సినిమాను విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు.