‘హలో గురు ప్రేమ కోసమే’ ట్రైలర్ టాక్ ఏంటి?

మొత్తానికి  రామ్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘హలో గురు ప్రేమ కోసమే’ట్రైలర్ వచ్చేసింది. త్రినాధ రావు నక్కిన  దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై దిల్ రాజు చాలా ఆశలు పెట్టుకున్నారు. ఆయనకు ఈ సినిమా ఖచ్చితంగా హిట్ కావాల్సిన అవసరం ఉంది. ట్రైలర్ అంతా రామ్ ఎనర్జీని సీన్ లలో బంధించటంలో దృష్టి పెట్టినట్లుంది. ముఖ్యంగా వరస లెంగ్తీ ప్రాసతో కూడిన పంచ్ డైలాగులు ఈ ట్రైలర్ లో అడుగు అడుగడుకుకి కనిపించటం గమనించవచ్చు.

ట్రైలర్ ప్రారంభమే.. రామ్ ఫైట్ తో మొదలైంది. ‘స్కూలైనా, కాలేజైనా, ఆఫీసైనా జాయిన్‌ అయిన తొలిరోజు అందరూ చేసే మొదటి పని ఏంటో తెలుసా? అమ్మాయిల్లో ఎవరు బాగున్నారని అబ్బాయిలు, అబ్బాయిల్లో ఎవరు బాగున్నారని అమ్మాయిలు ఏరుకోవడం’ అని రామ్‌ చెప్పిన డైలాగ్‌  రొటీన్ గా అనిపించినా..చెప్పించిన విధానం బాగుంది.

ఇక ఈ సినిమాలో రామ్ తో పాటు సమానమైన పాత్రలో ప్రకాశ్‌రాజ్‌ కనిపించారు. ..రామ్‌కు స్నేహితుడి పాత్రలో నటించారు. వారిద్దరి మధ్యా డైలాగులు సైతం బాగున్నాయి. అలాగే హీరోయిన్ అనుపమ, రామ్‌ ఓ కాఫీ షాప్‌లో కూర్చున్నప్పుడు అనుపమ..‘పెళ్లి అయిన తర్వాత అమ్మాయి జీవితం అమ్మ అవడం వల్ల బాగుంటుంది. పెళ్లికి ముందు అమ్మాయి జీవితం నాన్న ఉండడం వల్ల బాగుంటుంది’ అంటుంది. ఇందుకు రామ్‌..‘ఈ సోదంతా చెబితే వినడానికి బాగుంటుంది’ అని  పంచ్‌ వేయటం నచ్చుతోంది.

ఇక ‘అబద్ధాలు చెబితే అమ్మాయిలు పుడతారో లేదో తెలీదు కానీ అబద్ధాలు చెబితే అమ్మాయిలు మాత్రం కచ్చితంగా పడతారు’, ‘గుర్తుంచుకోవాలి గుర్తుంచుకోవాలి అని చదివే చుదువును మాత్రం మర్చిపోతాం. కానీ మర్చిపోవాలి మర్చిపోవాలి అనుకున్న అమ్మాయిని మాత్రం చచ్చేదాకా మర్చిపోలేం’ అని ట్రైలర్ చివర్లో  రామ్‌ చెప్పిన డైలాగ్‌ కూడా ట్రెండీగా ఉంది.

 శిరీష్‌, లక్ష్మణ్‌ ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిల్‌రాజు సమర్పిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ ఈ చిత్రానికి సంగీతం అందించారు.