కథను పక్కనపెట్టి కాంబినేషన్ ను సెట్ చేసుకుంటే చాలు అనుకునే హీరోలు, దర్శకులకు ఎప్పుడు కనువిప్పు కలుగుతుందో మరి ?
ఇటీవల కాలంలో నిర్మాతను పక్కన సెట్ ప్రాపర్టీలా పెట్టేసి , దర్శకుడు , హీరో ఒకటై సినిమా చేసేస్తున్నారు . అలా చేసిన సినిమాలు విడుదల అయ్యాక ఏమైపోతున్నాయో, ఎంతగా అపజయం పాలవుతున్నాయో తెలిసిందే. అక్కినేని కుటుంబానికి ఘనమైన పేరే వుంది . అక్కినేని వారసులుగా నాగార్జున, నాగచైతన్య , అఖిల్ , సుమంత్ , సుశాంత్ సినిమా రంగంలో వున్నారు . నాగార్జున కుమారుడు నాగ చైతన్య కెరీర్ అనుకున్నంతగా సాగటం లేదు . రెండవ కుమారుడు అఖిల్ కూడా విజయవంతమైన సినిమా అందించలేదు సుమంత్ చాలా కాలం తరువాత “ఎన్టీఅర్ ” బయోపిక్ లో అక్కినేని పాత్ర ధరిస్తున్నాడు . సుశాంత్ ప్రతి సినిమాలో కష్ట పడుతున్నాడు కానీ ఫలితం దక్కడం లేదు .
నాగచైతన్య , రమ్య కృష్ణ నటించిన “శైలజారెడ్డి అల్లుడు ” సినిమా కాంబినేషన్ చూసి పెద్ద హిట్ అవుతుందని ఊహించారు . ఈనెల 13న విడుదలైన ఈ సినిమా తీవ్ర నిరాశను మిగిల్చింది . రమ్యకృష్ణ గ్లామర్ పనిచేయలేదు . దర్శకుడు మారుతి మేజిక్ విజయానికి చేర్చలేకపోయింది. నాగార్జున , నాని కలసి నటించిన “దేవదాస్ “సినిమా 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది . శ్రీరామ్ ఆదిత్య ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు . ఈ సినిమా కూడా ఊహించని పరాజయం చెందటంతో అక్కినేని కుటుంబం పెద్ద షాక్ తో ఉందట. “దేవదాస్ ” అనే టైటిల్ పెట్టడమే పెద్ద తప్పు. భారతీయ భాషల్లో ఎన్నో దేవదాస్ సినిమాలు వచ్చినా ఈ నాటికీ అక్కినేని నటించిన దేవదాస్ సినిమానే నెంబర్ వన్ గా వుంది . తెలుగులో మరో రెండు దేవదాస్ సినిమాలు వచ్చినా అవి అక్కినేని కుటుంబ హీరోలు చేసినవి కాదు . నాగార్జున ఈ సినిమాకు “దేవదాస్ ” అనే పేరు పెట్టడానికి ఒప్పుకొని పెద్ద తప్పు చేశాడనే విమర్శలు వినిపిస్తున్నాయి తండ్రి కొడుకుల సినిమాలతో పాటు సమంత నటించిన “యూ టర్న్ ” కూడా ఓహో అన్నంత లేదు . కాబట్టి అక్కినేని కుటుంబానికి మూడు సినిమాలు మూడ్ ను మార్చేశాయని అనుకుంటున్నారు .