సూపర్‌స్టార్ మహేష్ బాబుతో సినిమా చెయ్యాలని ఎవరికి ఉండదు. అయితే ఎవరితో పడితే వారితో మహేష్ చెయ్యరని తెలుసు. ఆయన డేట్స్ స్టార్ ప్రొడ్యూసర్స్, డైరక్టర్స్ కే పరిమితం. సరైన కాంబినేషన్ మహేష్ తో సెట్ చేస్తే టేబుల్ ప్రాఫెట్స్ మామూలుగా ఉండవు.. ఈ విషయం అల్లు అరవింద్ కు తెలుసు. ఆయన మాస్టర్ మైండ్ ఈ విషయం పసిగట్టినా సరైన డైరక్టర్ ఆయనకు సెట్ కాక ఆగిపోయారు.
కానీ అర్జున్ రెడ్డి డైరక్టర్ లో ఆయనకు ఓ భాక్సాఫీస్ సూపర్ హిట్ కనపడింది. మహేష్, సందీప్ వంగా కలిస్తే కలెక్షన్స్ అదిరిపోతాయనిపించింది. దానికి తోడు మహేష్ సైతం సందీప్ తో చేయటానికి ఉత్సాహం చూపిస్తున్నారు. ఈ నేపధ్యంలో వీరిద్దరితో మీటింగ్ లు పెట్టిన ఫైనలైజ్ చేసిన అరవింద్ …ఓ కథ రెడీ చేయిస్తున్నారట. స్టోరీ లైన్ ఓకే చేసి కథను వండుతున్నారని సమాచారం. ఈ సినిమా గురించి అధికారిక సమాచారం లేకపోయినప్పటికీ త్వరలోనే ప్రకటన వచ్చే అవకాశముందని తెలుస్తోంది.
సందీప్ రెడ్డి ప్రస్తుతం `అర్జున్‌రెడ్డి` హిందీ రీమేక్ పనులతో బిజీగా ఉన్నాడు. అలాగే మహేష్ తన తాజా చిత్రం మహర్షి బిజిలో ఉన్నాడు. వంశీపైడిపల్లి రూపొందిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు, అశ్వనీదత్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా తర్వాత మైత్రీమూవీస్ నిర్మాణంలో సుకుమార్ రూపొందించే సినిమాకు మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. సుకుమార్ తర్వాత `అర్జున్‌రెడ్డి` డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ఓ సినిమాలో నటించేందుకు మహేష్ చేయబోతున్నారు.