రాజకీయాల్లో వాళ్లు..వీళ్లు అనే తేడా లేదు. ఓటు పడుతుందనిపిస్తే వాడేస్తారు. ఇప్పుడు మహేష్ విషయంలో అదే జరుగుతోంది. ఐదేళ్లలో తాను చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరిస్తూ గుంటూరు తెలుగు దేశం పార్టీ ఎంపీ గల్లా జయదేవ్ సోమవారం ఓ పుస్తకాన్ని విడుదల చేశారు.
అందులో …తననేమీ చేయలేక తన బావ హీరో మహేశ్‌బాబుపై ఐటీ దాడులు చేసినట్టు గల్లా ఆరోపించారు. ఐటీ దాడులకు కారణం చెప్తూ..ప్రధానిని ఎదిరించి లోక్‌సభలో మాట్లాడానని.. వెంటనే తనకు ఈడీ నోటీసులు వచ్చాయని చెప్పారు. ఆదాయ పన్ను అధికారులు దాడులు చేస్తామని తనను బెదిరించారని తెలిపారు.
వాస్తవానికి 2007-2008 ఆర్థిక సంవత్సరంలో బ్రాండ్ అంబాసిడర్ గా తీసుకున్న పారితోషికానికి సర్వీస్ ట్యాక్స్ కట్టలేదని మహేష్ బాబుకి చెందిన రెండు బ్యాంక్ అకౌంట్లను అటాచ్ చేశారు. ఆ తర్వాత మహేష్ బాబుకి సంబంధించిన సినిమా హాల్ పై కూడా ఐటీ రైడ్స్ జరిగాయి. అయితే దీనిపై మహేష్ పెద్దగా స్పందించ లేదు, ఎవరూ కూడా రాజకీయ కోణం వెదకలేదు.
కానీ ఇప్పుడు గల్లా జయదేవ్ దాన్ని రాజకీయ కోణంలో చూడమంటున్నారు. అంతకుట్ర జరిగే ఉంటే..వాస్తవంగా ఐటీరైడ్స్ జరిగినప్పుడే జయదేవ్ మాట్లాడి ఉండాల్సిందని,కేవలం ఎన్నికల ముందు ఈ విషయం ఎందుకు గుర్తు చేస్తూ హైలెట్ చేస్తున్నారని మోడీ అభిమానులు ప్రశ్నిస్తున్నారు.
ఇక మహేష్ మొదటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. 2014లో గల్లాజయదేవ్ ఎంపీ అభ్యర్థిగా పోటీచేస్తున్నా కూడా మహేష్ బాబు ప్రచార కార్యక్రమాలకు రాలేదు. కనీసం తన సందేశం కూడా వీడియో ఆడియో రూపంలో బైటకు విడుదల చేయలేదు. పార్టీ కండువాలతో ఎప్పుడూ ఫొటోలు దిగలేదు. కేవలం ట్విట్టర్ లో మాత్రమే తన బావకు ఓటేయండి చెప్పారు.