మూవీ రివ్యూ : ‘ఫ్రెంచ్ బిర్యానీ’ – ఇదో న్యూవేవ్ కామెడీ

French Biryani Movie Review

మరో కన్నడ డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ ప్రేక్షకుల ముందుకొచ్చింది. కన్నడలో తొలి రెండు ఓటీటీ విడుదలలు చేసిన  నిర్మాణ సంస్థగా పిఆర్ కె ప్రొడక్షన్స్ నిలిచింది. ఈ నెలలోనే ‘లా’ తర్వాత ఇప్పుడు ‘ఫ్రెంచ్ బిర్యానీ’ అందించింది. ప్రముఖ కన్నడ దర్శకుడు టిఎస్ నాగాభరణ కుమారుడు పన్నాగభరణ ‘ఫ్రెంచ్ బిర్యానీ’ దర్శకుడు. ప్రముఖ బెంగళూరు స్టాండప్ కమెడియన్లు డానిష్ సేట్, సాల్ యూసుఫ్ లు టైటిల్ పాత్రలు. టిక్ టాక్ స్టార్ దిశా మదన్ హీరోయిన్. రొటీన్ టెంప్లెట్ కథనే నేపథ్య ప్రాధాన్యంతో సరికొత్త స్టయిలిష్ కామిక్ థ్రిల్లర్ గా ఎలా మార్చారో చూద్దాం…

కథ

బెంగళూరులో సి – కంపెనీ ముసలి డాన్ ఛార్లెస్ అలియాస్ పౌడర్ ఛార్లెస్ (మైకేల్ మధు) కొడుక్కి ఓ మాట చెప్పి చచ్చిపోతాడు. సైమన్ అనేవాడు వచ్చి సులేమాన్ కి సరుకు అందిస్తాడని. కొత్త డాన్ గా బాధ్యతలు తీసుకున్న కొడుకు మసల్ మణి (మహంతేష్) కన్ఫ్యూజ్ అయిపోతాడు. సైమన్ అనే వాడు వచ్చి సులేమాన్ కి సరుకు అందిస్తాడా, లేక సులేమాన్ అనేవాడు వచ్చి సైమన్ కి సరుకు అందిస్తాడా తికమక పడి  డ్రైవర్ సులేమాన్ ని ఏర్ పోర్టుకి పంపిస్తాడు. అక్కడ సైమన్ ని సామాన్ గా పలుకుతూ ఫ్లయిట్ దిగిన వాళ్ళని అడుక్కుంటూ వుంటాడు సులేమాన్. చివరికి ఫ్రాన్స్ నుంచి వచ్చిన ఫ్రెంచి సైమన్ (సాల్ యూసుఫ్) ని చూసి ఇతనే అనుకుని క్యాబ్ ఎక్కించుకుని తీసికెళ్ళి పోతాడు.

దారిలో ఒక సంఘటన జరిగి అస్ఘర్ అలీ (డానిష్ సేట్) ఆటో ఎక్కేస్తాడు సైమన్. ఆటో యాక్సిడెంట్ అవుతుంది. బ్యాగు దొంగ కొట్టేస్తాడు. సెల్ ఫోన్ ఆవు మింగేస్తుంది. మెడికల్ కాన్ఫరెన్స్ కి వెళ్ళలేక, హోటల్ కీ వెళ్ళలేక, ఫ్రెంచి ఎంబసీ వాళ్ళూ రానియ్యక, రోడ్డున పడితే, సరుకుతో వున్న బ్యాగు కోసం మసల్ మణి గ్యాంగ్ ఒక వైపు, ఇన్స్ పెక్టర్ మహదేవ్ (రంగాయణ రఘు) ఇంకోవైపు వెంటాడుతూంటే, దేశం కాని దేశంలో కంగారెత్తి  పోతాడు సైమన్. నానా పాట్లు పడి అతణ్ణి కాపాడుతున్న అస్ఘర్ కి ఇంటి దగ్గర సమస్యలుంటాయి. ఇక వీళ్ళిద్దరి సమస్యలు ఎలా తీరాయన్నది మిగతా కథ.

నటనలు – సాంకేతికాలు

కర్ణాటక మాజీ మంత్రి అజీజ్ సేట్ మనవడు డానిష్ సేట్ తో బాటు, సాల్ యూసుఫ్ బెంగుళూరు స్టాండప్ కమెడియన్లుగా కలిసి వెండి తెర మీద కన్పించడం అభిమానులకి పండగే అయింది. ఈ కామిక్ థ్రిల్లర్ ని తమ తమ పర్ఫెక్ట్ కామిక్ సెన్స్ తో నిలబెట్టారు. వెకిలి కామెడీ బారిన పడకుండా ఈ స్టయిలిష్ మల్టీ కల్చరల్, కాస్మోపాలిటన్ కామెడీని కాపాడారు. కాకపోతే ఆటో డ్రైవర్ గా సేట్ పలికే ఉర్దూ డైలాగులు అనేక చోట్ల బూతులు దొర్లుతాయి. ఫ్రెంచి దేశస్థుడుగా యూసుఫ్ కామెడీ పాత్ర కాకపోయినా అతడి కష్టాలు కామెడీగా వుంటాయి. ఇద్దరూ కలిసి ఈ బెంగళూరు కామెడీకి ఒక స్టార్ ఎట్రాక్షన్ ని  తీసుకొచ్చారు.

ఆటో డ్రైవర్ అస్ఘర్ చెల్లెలు రహీలా గా సుధా శ్రీనివాస మూర్తి నటించింది. ఈమెకిది తోలి అవకాశం. ఈమె భర్త పురుషోత్తంగా నాగభూషణ నటించాడు. ఇతడి ‘పంపులో నీళ్ళు లేక’ పిల్లలు పుట్టక పోతే భార్యకే విడాకులిస్తానని గొడవ పెట్టుకునే పాత్ర. ‘పంపులో నీళ్ళు లేకపోయినా’ ఆడవాళ్ళకి పిల్లలు పుట్టాలంటాడు. పిల్లల్ని పుట్టిస్తున్న వాళ్ళని చూస్తే అసూయ. పిల్లల్ని పుట్టిస్తున్న వాళ్ళని దేశం నుంచి వెళ్ళ గొట్టాలంటాడు. ఇదంతా సబ్ ప్లాట్ కథపాత్ర.

 ఇంకో ప్రముఖ పాత్ర మసల్ మణి తమిళ డాన్ పాత్ర. ఈ పాత్రలో మహంతేష్ కామిక్ విలనీతో  బాగా ఎంటర్ టైన్ చేస్తాడు. తను కొలంబియా డ్రగ్ లార్డ్ పాబ్లో ఎస్కోబార్ లా ఫీలై పోతూంటాడు. పాబ్లో లాగానే పోలీస్ ఫైరింగ్ లో చస్తాడు. ఇలా అని బ్రేకింగ్ న్యూస్ ఇస్తాడు ఇన్స్ పెక్టర్ మహదేవ్. నిజానికి గ్యాంగ్ వార్ లో చచ్చిపోతే తను చంపినట్టు న్యూస్ ఇచ్చుకుంటాడు. ఇన్స్ పెక్టర్ మహదేవ్ గా రంగాయణ రఘు ది హిలేరియస్ నటన. తను బ్లాక్స్ ని పట్టుకుని ఎడాపెడా కొడతానన్నప్పుడు, సైమన్ పాత్రలో సాల్ యూసుఫ్, నువ్వు రేసిస్ట్ కామెంట్స్ చేస్తున్నావంటాడు. దీంతో రేసిస్టు అంటే రేసింగ్ అనుకుని, తను ఎన్నెన్ని రేసులు గెలిచాడో చెప్పుకుపోతూ ఫూలిష్ సీను క్రియేట్ చేస్తాడు రంగాయణ.  

టీవీ రిపోర్టర్ మాలినిగా దిశా మదన్ నాల్గయిదు సీన్లలో కన్పించే హీరోయిన్. చివర్లో ఆటోడ్రైవర్ అస్ఘర్ తో లవ్ ఓకే అయిపోయే ఫక్తు పాత ఫార్ములా పాత్ర. టిక్ టాక్ స్టార్ గా పాపులర్ అయిన తను సినిమా హీరోయిన్ గా కొనసాగే మెటీరియల్ అంతా వుంది.

సాంకేతిక విలువలు బావున్నాయి. కెమెరా వర్క్, కలర్స్, లైటింగ్ లతో కూడిన విజువల్స్, బెంగళూరు లొకేషన్స్, ట్రెండీ కాస్ట్యూమ్స్, యాక్షన్, ఛేజ్ సీన్లు పకడ్బందీగా వున్నాయి. వాసుకీ వైభవ్ సంగీతం గత ‘లా’ లోలాగా కాకుండా మాంచి పెప్ తో వుంది. ‘అతిధి దేవోభవ’ ర్యాప్ సాంగ్, దాని చిత్రీకరణ హైలైట్.

కథాకథనాలు

పాత రొటీన్ టెంప్లెట్ కథే. ఒకరనుకుని ఇంకొకర్ని టార్గెట్ చేసే మిస్టేకెన్ ఐడెంటిటీ బాపతు కథ. ఒక బ్యాగు కోసం కొన్ని గ్రూపులు ప్రయత్నించే అరిగి పోయిన కథ. ఈ కథకి స్క్రీన్ ప్లే లేదు. అంటే హీరో పాత్ర అస్ఘర్ అనుకుంటే అతడికి గోల్ లేదు, కథ అతడి మీద వుండదు, అతను ముగించడు. క్లయిమాక్స్ లో అతను వుండడు. మరి కథ ఎవరి మీద వుంటుందంటే, ఎవరి మీదా వుండదు. అందరూ తోచిన విధంగా కథ నడుపుతూంటారు. కనుక హీరోలేని అర్ధంపర్ధం లేని క్లయిమాక్స్ తయారయ్యింది. ఫన్నీ క్యారక్టర్స్ తో ఫన్నీ సీన్స్ నడపడమే దర్శకుడు కథ అనుకున్న కథ.

దీన్ని బెంగళూరు బ్యాక్ డ్రాప్ లో నడపడమే, అదీ బెంగళూరు జనజీవితాన్ని రియలిస్టిక్ గా భాగం చేయడమే, ఈ మైండ్ లెస్ మూవీ వీక్షణాసక్తి పెరిగేలా చేసింది. వివిధ పాత్రలు నగరంలోంచి వూడి పడ్డట్టు వుంటాయి. అవి వాటి వాటి భాష, యాస మాట్లాడే స్తాయి. ఆటో డ్రైవర్ ‘హీరో’ చాలా వరకూ కన్నడ యాసలో ఉర్దూయే మాట్లాడతాడు. అతడింట్లో సీన్లు ఉర్దూలోనే వుంటాయి. ఫ్రెంచి సైమన్ బ్రోకెన్ ఇంగ్లీషులో, ఫ్రెంచిలో మాట్లాడతాడు. యంగ్ డాన్ కన్నడింగ్లీషు మాట్లాడతాడు. కన్నడ మాట్లాడే పాత్రలు కన్నడ మాట్లాడతాయి. ఇలా కన్నడ, ఉర్దూ, ఇంగ్లీషు, ఫ్రెంచి భాషలతో బెంగళూరు భిన్న సంస్కృతుల కాస్మోపాలిటన్ వాతావరణాన్ని క్రియేట్ చేస్తారు. భాషలు ప్రేక్షకు లెవరికో అర్ధం కావేమో ననే సంశయాలు పెట్టుకోలేదు. ఫ్రీ స్టయిల్ రైటింగ్, మేకింగ్ చేశారు. కాలం లో ఎక్కడో ఇరుక్కున్న సినిమా సంకెళ్ళని తెంచి పారేశారు. ఇప్పుడు కావాల్సిన న్యూ ఏజ్ సినిమాగా ఎస్టాబ్లిష్ చేశారు.

భిన్న సంస్కృతుల్ని ప్రదర్శించే ‘అతిధి దేవోభవ’ ర్యాప్ సాంగ్ తో బెంగళూరు నగర జీవితమంతా నగరవాసులు ఐడెంటిఫై చేసుకునేలా కళ్ళ ముందుంచారు. దృశ్యపరమైన అసభ్యత లేకపోయినా, డైలాగుల్లో ధారాళంగా బూతులు ప్రవహిస్తాయి. ఒక పాటే fuck-ruddin అనే పల్లవితో వుంది. ఇక సెల్ ఫోన్ మింగేసిన ఆవుతో గోమాత సీను, ఆవు కడుపులోంచి సెల్ ఫోన్ తీస్తానని ఎదురుగా మటన్ షాపు వాడు ఆఫరివ్వడం, చచ్చిన ముసలి డాన్ శవయాత్రలో శవాన్ని మోటార్ సైకిల్ ఎక్కించి తిప్పడం, ఆ పాడె మోస్తున్న అస్ఘర్ పాడె వదిలేస్తే మోటార్ సైకిల్ సహా శవం కింద పడడం… జనాభా సమస్యపై జోకులు, రేసిస్టు కామెంట్లతో కామెడీ… ఇలా చుట్టూ వున్న ప్రపంచంలో ఏం జరుగుతోందో వాటినీ వాడేశారు.

రచన, దర్శకత్వం అన్నవి కొత్త పుంతలు తొక్కాయి. ఈ రెండూ కాలాన్ని దాటి వుండక పోతే ఈ కామిక్ థ్రిల్లర్ వృధా అయ్యేది.


రివ్యూ 9
‘ఫ్రెంచ్ బిర్యానీ’ – ఇదో న్యూవేవ్ కామెడీ
దర్శకత్వం: పన్నాగాభరణ
తారాగణం: డానిష్ సేట్, సాల్ యూసుఫ్, దిశా మదన్, సింధూ శ్రీనివాస మూర్తి, మైకేల్ మధు, మహంతేష్, రంగాయణ రఘు తదితరులు
రచన: పన్నాగాభరణ, అవినాష్ బలెక్కల, సంగీతం: వాసుకీ వైభవ్, ఛాయాగ్రహణం: కార్తీక్ పళని
బ్యానర్: పిఆర్ కె ప్రొడక్షన్స్, నిర్మాత: అశ్వనీ పునీత్ రాజ్ కుమార్, గురుదత్ తల్వార్
విడుదల: అమెజాన్ ప్రైమ్
3/5
*** 

-సికిందర్