సంక్రాంతి పందానికి ఆ నాలుగు సినిమాలు

కొత్త ఆశలతో, సరి కొత్త కోర్కెలతో అందరూ నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టారు .  పాత జ్ఞాపకాలు అనుభవాలు గా కొత్త జీవితానికి స్వాగతం చెబుతున్నారు . తెలుగు సినిమా రంగం కూడా కొత్త సంవత్సరంలో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నది . గత సంవత్సరం కన్నాఈ సంవత్సరం మరింత ఉత్సాహంతో సాగిపోవాలని తగిన ప్రణాళికలు రచిస్తున్నారు .

కొత్త సంవత్సరం అనగానే జనవరి మాసంలో వచ్చే సంక్రాంతి పండుగ సినిమా రంగానికి ఎంతో ముఖ్యమైనది . పెద్ద సినిమాలు సంక్రాంతికి విడుదలయ్యేలా చూసుకుంటారు . ఈ సంక్రాంతికి నాలుగు పెద్ద సినిమాలు విడుదలవుతున్నాయి . బాలకృష్ణ నిర్మిస్తూ నటించిన “ఎన్టీఆర్ మహా నటుడు ” 9వ తేదీన విడుదలవుతుంది . నిజానికి సంక్రాంతి పండుగకు ముందే ఈ ప్రతిష్ఠాత్మక సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది . బాలకృష్ణ , విద్యాబాలన్, రానా , నిత్యా మీనన్, రకుల్ ప్రీత్ , సుమంత్, హన్సిక , పాయల్ , ప్రకాష్ రాజ్ మొదలైన వారు నటిస్తున్నారు . కీరవాణి సంగీతం సమకూరుస్తున్నాడు , క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నాడు . ఏ సినిమా విషయంలో భారీ అంచనాలే వున్నాయి. ఇప్పటికే ఈ సినిమాను పెద్ద రేట్లకు అమ్మారు .

జనవరి 10 న రజనీకాంత్ నటించిన “పేట ” సినిమా విడుదలవుతుంది . కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించిన “పేట ” చిత్రంలో రజనీకాంత్ తో పాటు విజయ్ సేతుపతి , సిమ్రాన్ , త్రిషా నటిస్తున్నారు . కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిరుద్ రవిచందర్ సంగీతం సమకూర్చారు . ఈ సినిమా భారీ స్థాయిలో విడుదలవుతుంది . రాంచరణ్ , కైరా తో బోయపాటి శ్రీనివాస రావు దర్శకత్వంలో డి వి వి దానయ్య నిర్మిస్తున్న “వినయ విధేయ రామ ” సినిమా జనవరి 11న విడుదలవుతుంది .

ఈ సినిమాను బోయపాటి శ్రీను యాక్షన్ ప్రధానంగా తీర్చిదిద్దారని అంటున్నారు . దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు . ఈ సినిమా మీదా కూడా అంచనాలు భారీగానే వున్నాయి . ఈ సినిమాలో హిందీ నటుడు వివేక్ ఓబ్రాయ్ ప్రత్యేక పాత్రలో నటించాడు వెంకటేష్ ,వరుణ్ తేజ్ తో అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన “ఎఫ్ 2” సినిమా జనవరి 12 న విడుదలవుతుంది .

తమన్నా , మెహరీన్ నాయికలు గా తెరకెక్కిన ఈ సినిమా ఆద్యంతం హాస్యభరితంగా సాగుతుందట . రెండు జంటలు . ఒకటి ఆంధ్ర , మరోటి తెలంగాణ మధ్య జరిగే ఘటనల సమాహారమే ఈ సినిమా. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు.

వెంకటేష్ సినిమా వచ్చి చాలా కాలమవుతుంది . ఈ సినిమా మీద కూడా అంచనాలు బాగానే వున్నాయి . విశేషం ఏమంటే ఎన్టీఆర్ బయోపిక్ లో రానా నటిస్తున్నాడు . ఎఫ్ 2లో వెంకటేష్ నటిస్తున్నాడు . బాబాయి , అబ్బాయి నటిస్తున్న రెండు సినిమాలు సంక్రాంతి బరిలో వున్నాయి . మరో వైపు వినయ్ విధేయ రామ లో రామ్ చరణ్ నటిస్తున్నాడు , ఎఫ్ 2లో వరుణ్ తేజ్ నటిస్తున్నాడు . ఇద్దరు సోదరుల సినిమాలు పోటీపడుతున్నాయి .

నాలుగు పెద్ద సినిమాలు వరుసగా జనవరి 9, 10, 11, 12 తేదీల్లో విడుదలవుతున్నాయి . మరి వీటన్నింటికీ థియేటర్లు ఎలా సర్దుబాటు చేస్తారో ? అన్నీ పెద్ద సినిమాలే .. సంక్రాంతి బరిలో విజయం సాధుసే సినిమాలు ఎన్నో చూడాలి ..!
-భగీరథ