ఫైట్ మాస్టర్ రాజు వద్ద చిరంజీవి ట్రైనింగ్ పొందారని, చాలా గొప్ప స్థాయికి ఎదిగారని, చివరకు ఆయన తమను పట్టించుకోలేదని భార్య అనంతలక్ష్మి అన్నారు. స్టంట్ మాస్టర్ రాజు 67వ జయంతిని ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం దేశాయి పేటలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన భార్య అనంతలక్ష్మి మీడియాతో మాట్లాడారు.
ఆమె మాట్లాడుతూ, ఎన్టీఆర్, చిరంజీవి, బాలయ్య, నాగార్జున, వెంకటేష్ లాంటి స్టార్ హీరోలకు తన భర్త మంచి హిట్స్ ఇచ్చారని చెప్పారు. రాజు చనిపోయి 9 ఏళ్లు అవుతున్నా తమను సినీపరిశ్రమ కానీ, ప్రభుత్వాలు కానీ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
అలాగే రామ్ లక్ష్మణ్, బాహుబలి ఫైట్ మాస్టర్ సాల్మన్ రాజు కూడా తన భర్త శిష్యులేనని చెప్పారు. సాల్మన్ రాజుకు జాతీయ అవార్డు రావడం సంతోషంగా ఉందని… అయితే, గురువు రాజును మర్చిపోవడం మాత్రం బాధాకరమని అన్నారు.
కొన్ని వందల చిత్రాలకు ఫైట్ మాస్టర్ గా చేసిన ఆయన ముంబయి నుంచి ఫైటర్స్ దిగుమతి చేసుకునే కాన్సెప్ట్ కు నాంది పలికారు. అలా వచ్చిన వారిచేత రకరకాల ఫీట్స్ చేయించి ప్రేక్షకులను అలరించారు. ఒకానొక టైమ్ లో దాదాపు అన్ని తెలుగు సినిమాలకూ ఆయనే ఫైట్స్ సమకూర్చి పూర్తి స్ధాయి బిజీగా ఉన్నారు.
అయితే ఈ మధ్య వయస్సు మీదపడటం, కొత్త కొత్త వారు ఫైట్ మాస్టర్స్ గా సక్సెస్ అవటంతో ఆయన ఖాళీగా ఉన్నారు. అయితే తెలగు సినిమా తెలుసున్న ప్రతీ ఒక్కరికీ ఫైట్ మాస్టర్ రాజు తెలుసు అనటంలో అతిశయోక్తి లేదు.