(ధ్యాన్)
సినిమా పరిశ్రమలో మెగాస్టార్‌గా కొన్ని దశాబ్దాలు వెలిగిన ఘనత చిరంజీవిది. ఒకసారి విలేకరులు `మీ తర్వాత మీ స్థానానికి పరిశ్రమలో ఎవరు వస్తారనుకుంటున్నారు` అని అడిగారట. అందుకు చిరంజీవి కాసేపు ఆలోచించి `మహేష్` అని చెప్పారట. ఆ మాటను అలా అనడం మెగాస్టార్ గొప్పతనమని మహేష్ ఆనందాన్ని వ్యక్తం చేశాడు. మరోవైపు చిరంజీవి తనయుడు రామ్ చరణ్, మహేశ్ ఇద్దరూ మంచి స్నేహితులు. ఇంతకీ ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నాం. మహేష్ హీరోగా రూపొందుతోన్న `మహర్షి`ని 2019 ఏప్రిల్ 5న విడుదల చేయాలనుకుంటున్నారు. అయితే అదే వేసవికే చిరంజీవి నటిస్తోన్న `సైరా` కూడా విడుదల కానుంది. ఈ సినిమాను కూడా ఏప్రిల్ నెలలోనే విడుదల చేయాలని ప్లాన్. అయితే `సైరా` టీమ్ ఇంకా డేట్‌ని నిర్ణయించుకోలేదు. ఒకవేళ రెండూ ఒకేసారి వస్తే..? అనవసరంగా ఓపెనింగ్స్ ని షేర్ చేసుకోవాల్సి ఉంటుంది. కలెక్సన్లు కూడా డివైడ్ అవుతాయి. మరి `సైరా` ముందు రావాలని పట్టుబడితే మహేష్ వెనక్కి జరుగుతాడా? ఏమో.. ఎందుకంటే 2018 వేసవిలో కూడా మహేష్ సినిమా `భరత్ అనే నేను`కు, మెగా హీరో అల్లు అర్జున్ సినిమా `నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా`కు మధ్య టైట్ వార్ నడిచింది. దాంతో మహేష్ ఒకడుగు వెనక్కి వేసి `నా పేరు సూర్య`కు అవకాశం ఇచ్చారు. ఒకసారి ఇస్తే ఇచ్చారు కానీ, ప్రతిసారీ వెనక్కి తగ్గితే ఫ్యాన్స్ ఒప్పుకోరు. ఈ సారి నిజంగా ఢీ కొట్టాల్సి వస్తే నేరుగా ఢీ కొడతారు కానీ, వెనక్కి తగ్గితే ఫ్యాన్స్ మనోభావాలు దెబ్బతింటాయని, అలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాలని మహేష్ నిర్మాతలతో అన్నట్టు వినికిడి. ఒకటికి రెండు సార్లు ఆలోచించే నిర్మాతలు రిలీజ్ డేట్‌ను ప్రకటించారట.