కామెడీ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా రూపొందుతోన్న మల్టీస్టారర్ మూవీ ‘ఎఫ్ 2’. ‘ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’ అనేది ట్యాగ్ లైన్. ఇందులో తమన్నా, మెహరీన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు ఈ సినిమా నిర్మిస్తున్నారు. సంక్రాంతికి కానుకగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా ‘f2’ టీజర్‌ను విడుదల చేశారు.
వెంకటేష్ ఫన్నీ డైలాగ్‌తో టీజర్ మొదలైంది. ‘ఇప్పుడు ఈ పెళ్లి అవసరమా వెంకీ?’ అని రఘుబాబు అంటే.. ‘నేను మీలాగా కాదు.. పెళ్లాంని ఎలా కంట్రోల్ చేయాలో నాకు బాగా తెలుసు..’ అన్న వెంకీ.. ఆ తర్వాత భార్య తమన్నాతో వేగలేక ముప్పతిప్పలు పడుతూ కనిపించారు.
దిల్ రాజు మాట్లాడుతూ.. ‘‘కుటుంబ కథా చిత్రాలకు ప్రాధాన్యత ఇచ్చే మా బ్యానర్‌లో వస్తోన్న ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఫన్ రైడర్ ‘ఎఫ్ 2’. ‘పటాస్, సుప్రీమ్, రాజా ది గ్రేట్’ వంటి చిత్రాలతో హ్యాట్రిక్ సక్సెస్‌ను సాధించిన అనిల్ రావిపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నెల 12న టీజర్‌ను రిలీజ్ చేస్తున్నాం. త్వరలో పాటలను విడుదల చేసి, సంక్రాంతికి చిత్రాన్ని ప్రేక్షకులు ముందుకు తీసుకొస్తాం’’ అన్నారు.
‘ఒక చరిత్ర గురించి చెప్పాలంటే క్రీస్తుపూర్వం, క్రీస్తుశకం అంటాం.. ఒక మగాడి గురించి చెప్పాలంటే పెళ్లికి ముందు పెళ్లికి తర్వాత..’ అంటున్నారు వెంకటేశ్. ‘ఓ చరిత్ర చెప్పాలంటే తెలంగాణ రాకముందు.. తెలంగాణ వచ్చిన తర్వాత’ అని వరుణ్ అన్నారు.
‘ఇప్పుడు పెళ్లి అవసరమా సోదరా?’ అని వెంకీ.. వరుణ్‌తేజ్‌తో అంటే.. ‘నేను నీలాగా కాదు.. పెళ్లాన్ని ఎలా కంట్రోల్ చేయాలో నాకు మస్తు తెలుసు’ అన్నారాయన. ఫైనల్ గా ‘పండక్కి బాగా గట్టిగా నవ్వించేటట్టు ఉన్నారుగా..’ అని జయప్రకాశ్ రెడ్డి అంటే.. ‘అంతేగా, అంతేగా..’ అని వరుణ్, వెంకీ కలిసి చెప్పడం సినిమాపై అంచనాలు పెంచుతోంది.