మెగా సక్సెస్ కోసమేనా ఇంత హంగామా?
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ చిత్రం `సైరా నరసింహారెడ్డి`. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ బ్యానర్ పై మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ నిర్మిస్తున్నారు. మెగాస్టార్ కోసమే సొంత నిర్మాణ సంస్థను స్థాపించిన చరణ్ `ఖైదీ నంబర్ 150` చిత్రాన్ని నిర్మించారు. నిర్మాతగా తండ్రి కోసం ప్రయాణం మొదలు పెట్టిన రామ్‌చరణ్ తాజాగా `సైరా: నరసింహారెడ్డి` కోసం ఓ రేంజ్‌లో శ్రమిస్తున్నారు. మునుముందు చిరు నటించే సినిమాల్ని కూడా తానే స్వయంగా నిర్మించాలని నిర్ణయించుకున్న రామ్‌చరణ్ అందుకు తగ్గట్టే చక్కని ప్లానింగ్‌తో సాగుతున్నారు.
ఇప్పటికే `సైరా` చిత్రీకరణ పూర్తి కావడంతో ప్రచారాన్ని భారీ స్థాయిలో ప్లాన్ చేసారు. `సైరా` ప్రమోషన్ కోసం ఇన్నాళ్లు చరణ్ ఒక్కడే శ్రమిస్తున్నాడని భావిస్తే.. రిలీజ్ దగ్గరపడుతుండటంతో మెగా ఫ్యామిలీ మొత్తం రంగంలోకి దిగుతోంది. రామ్‌చరణ్ ఇప్పటికే డిజిటల్ మీడియా, సోషల్ మీడియాను ప్రమోషన్స్ చేస్తున్నారు. అతడు ఇటీవలే ఇన్‌స్టాగ్రమ్‌లో ప్రవేశించింది సైరా ప్రచారం కోసమే. చెర్రీకి తోడు ఉపాసన కూడా మామ చిత్రానికి ప్రమోషన్ చేయడం మొదలుపెట్టారు. రీసెంట్‌గా చిరుతో ఉపాసన జరిపిన బీ పాజిటివ్ ఇంటర్వ్యూనే ఇందుకు ఉదాహరణ. `సైరా`కు సంబంధించిన ఎవరికీ చెప్పని విషయాల్ని ఈ ఇంటర్వ్యూలో చిరు చెప్పడం ఆసక్తిని రేకెత్తించింది. సైరా చిత్రం యువతరానికి స్ఫూర్తినిస్తుందని ఆ ఇంటర్వ్యూలో చిరు వెల్లడించారు.
ఓ వైపు కొడుకు, మరో వైపు కోడలు `సైరా` ప్రచారాన్ని హోరెత్తించేస్తున్నారు. వీళ్లకు తోడు రామ్ చరణ్ సోషల్ మీడియా టీమ్ ప్రచారంలో హంగామా సృష్టించబోతోందట. టాలీవుడ్ చరిత్రలో ఇంత వరకు ఎవరూ సాహసించని స్థాయిలో సైరా వీఎఫ్ఎక్స్- గ్రాఫిక్స్ వర్క్ ని ప్రపంచ వ్యాప్తంగా ది బెస్ట్ అనదగ్గ 26 స్టూడియోల్లో చేయిస్తున్నారు. గాంధీ జయంతి కానుకగా అక్టోబర్ 2న `సైరా` రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. పోస్ట్ ప్రొడక్షన్ లో కీలకమైన వీఎఫ్ఎక్స్ వర్క్ యుద్ధ ప్రాతిపదికన పూర్తవుతోంది. అక్టోబర్ లో రిలీజ్‌కి రాదు అన్న ప్రచారాన్ని తిప్పి కొడుతూ చెప్పిన తేదీకే రిలీజ్ చేయాలన్న పంతం చరణ్‌లో కనిపిస్తోందట. అందుకే ఎంతో రిస్క్ తీసుకుని `ఆర్.ఆర్.ఆర్`కి గ్యాప్ ఇచ్చి మరీ `సైరా` పనులన్నీ రామ్‌చరణ్ పర్యవేక్షిస్తున్నాడు. తండ్రి సక్సెస్ కోసం తనయుడు పడుతున్న శ్రమపై ఫిలింనగర్ జనం ఆసక్తిగా మాట్లాడుకుంటున్నారు. మరోవైపు `సైరా` చిత్రం ఘనవిజయం సాధించాలని మెగా ఫ్యాన్స్ ఇప్పటికే గుడులూ గోపురాల్లో అన్నయ్యకోసం ప్రార్థనలు చేస్తున్నారని తెలుస్తోంది.