ప్రతి సినిమాకు భారీగా డబ్బు ఖర్చు చేయడం సరైన విధానం కాదు. అదీ తొలి చిత్ర కథానాయకుడిపై రిస్క్ చేయడం అంటే ఆలోచించాలి. ఆయన చాలా కాలంగా పరిశ్రమలో ఉన్న టాప్ డైరెక్టర్లలో ఒకరు.. హీరో అవ్వాలనుకున్నారు. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు `సీనయ్య` అంటూ ఆయనను హీరో చేసేందుకే పూనుకున్నారు. స్టార్ డైరెక్టర్ వి.వి.వినాయక్ హీరో అయినట్టేనని అంతా అనుకున్నారు. కానీ దేనికైనా టైమ్ కలిసి రావాలి. తానొకటి తలిస్తే అన్న చందంగా ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ఉందా? లేదా? అన్న చర్చా వేడెక్కిస్తోంది.
ఈ చిత్రం చాలా కాలం క్రితమే ప్రకటించారు. ఫస్ట్ లుక్ కూడా విడుదలైంది. దీనికి మిశ్రమ స్పందన వచ్చింది. ఈ చిత్రంపై అటుపై ఎటువంటి హడావుడీ లేదు. అయితే ఈ చిత్రాన్ని చూసేందుకు జనం థియేటర్లకు ఎగబడతారా? అంటే అది కూడా సందేహమే. వివి వినాయక్ తొలి చిత్రమే అయినా దీనికోసం నిర్మాత రాజు గారు 10 కోట్ల బడ్జెట్‌తో రిస్క్ చేయడం ఇటీవల మరోసారి చర్చకు వచ్చింది. దిల్ చిత్రంతో రాజుకు మొదటి హిట్ ఇచ్చిన దర్శకుడు వినాయక్ కావచ్చు. కానీ `సీనయ్య` కోసం 10 కోట్లు ఖర్చు చేయడం అంటే ఆషామాషీనా? రాజుగారి గట్స్ కి మెచ్చుకోవాల్సిందే.
వినాయక్ ప్రస్తుతం దర్శకుడిగా వరుస వైఫల్యాలతో బ్యాడ్ ఫేజ్ లో ఉన్నాడు. ఆ క్రమంలోనే సీనయ్య గా ఎంట్రీ ఇవ్వాలని పట్టుబట్టాడు. కానీ ఇదీ దురదృష్టవశాత్తూ వర్కవుట్ కాలేదన్న చర్చ మొదలైంది. అసలేమవుతుందోనన్న సందేహం ఉండగా.. దానికి తోడు కరోనా కల్లోలం మరీ దారుణ సన్నివేశాన్ని క్రియేట్ చేసిందన్న ముచ్చటా సాగుతోంది. ఇక వినాయక్ నటనలోనే కొనసాగే వీలుందా? అంటే అందుకు ఛాన్సే లేదట. ఎందుకంటే అతను మళ్లీ దర్శకత్వానికి సిద్ధమవుతున్నారన్న సమాచారం ఇటీవల రివీలైంది. గత రెండేళ్లలో దిల్ రాజు కొన్ని ఫ్లాప్‌లను ఎదుర్కొన్నా.. సీనయ్య లాంటి ప్రయోగాలకు దిగడంపై ఫ్యాన్స్ లో చర్చ సాగుతోంది. ఆయన ఆడే జూదంలో ఎవరు పావు? అన్నది కూడా ఒక క్వశ్చన్ మార్క్ లా మారిందన్న ఆవేదన వ్యక్తం అవుతోంది.