మ‌హేశ్ బ‌ర్త్‌డేకి, నితిన్ సిన్మాకి లింక్ పెట్టిన దిల్‌రాజు!

ప్రముఖ నిర్మాత దిల్‌రాజు ఈ రోజు మహేశ్‌బాబు అభిమానులకు భలే బిస్కట్ వేశారు. మ‌హేశ్ బ‌ర్త్‌డేకి, నితిన్ సిన్మాకి లింక్ పెట్టేశారు. నితిన్ హీరోగా సతీష్ వేగేశ్న దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మించిన సినిమా ‘శ్రీనివాస కళ్యాణం’. ఈరోజుతో చిత్రీకరణ పూర్తి చేశారు. ఇటీవలే హైదరాబాద్‌లో మిక్కీ జె మేయర్ సంగీతందించిన పాటల్ని విడుదల చేశారు. ఆడియో రిలీజ్ తర్వాత లాస్ట్ సాంగ్ షూటింగ్ కోసం నితిన్, హీరోయిన్ రాశి ఖన్నా అరకు వెళ్లారు. సాంగ్ షూటింగ్ కంప్లీట్ చేశారు. త్వరలో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అంతా కంప్లీట్ చేసి ఆగస్టు 9న సినిమా విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా దిల్‌రాజు  హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ పెట్టారు. అందులోనే మహేశ్ అభిమానులను ఖుషి చేసే మాటను ఆయన చెప్పారు. 

 

అసలు మేటర్ ఏంటంటే… ఆగస్టు 9న మహేశ్ పుట్టినరోజు. అదే రోజున సినిమా విడుదల కానుండటం ఎంతో సంతోషంగా వుందని ఆయన చెప్పారు. మొన్నటివరకూ ‘బొమ్మరిల్లు’ విడుదల తేదీన ‘శ్రీనివాస కళ్యాణం’ విడుదల చేస్తున్నామని చెప్పిన ఆయనే ఈరోజు మహేశ్ పుట్టినరోజు ప్రస్తావన తేవడం ఆ హీరో అభిమానులకు బిస్కట్ వేయడమేనని ఇండస్ట్రీ గుసగుస. ఇటీవల దిల్‌రాజు నిర్మించిన ‘లవర్’ ప్లాప్ అయ్యింది. ఈ నేపథ్యంలో కొత్త సినిమా మీద బాగా కాన్సంట్రేట్ చేశారు. అందుకనే మహేశ్ పేరుని వాడుతున్నారు. “పన్నెండేళ్ల క్రితం ‘బొమ్మరిల్లు’ విడుదలైంది. మహేశ్ గారి పుట్టినరోజు ఆరోజే. మళ్లీ అదే రోజున ‘శ్రీనివాస కళ్యాణం’ వస్తుంది. ఇదీ హిట్టవుతుందని ఆశిస్తున్నాను” అని దిల్‌రాజు పేర్కొన్నారు. ఇటీవల అశ్వనీదత్ ‘మహానటి’ని ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ విడుదల తేదీన ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. అయన సెంటిమెంట్ వర్కవుట్ అయ్యి, హిట్ మేజిక్ రిపీటయ్యింది. తనకూ అదే మేజిక్ రిపీట్ అవుతుందని దిల్‌రాజు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.