దిల్‌రాజు మాటలు తేడా కొడుతున్నాయేంటి..రిజల్ట్ ముందే తెలిసిందా?

“ప్రతి సినిమా విజయం సాధిస్తుందని నమ్మకంతో పనిచేస్తాం. అయితే… మేం ఎంత కష్టపడ్డా ప్రేక్షకుడికి సినిమా నచ్చితేనే హిట్. సినిమాకి చేసిన వారందరికీ ప్రతిఫలం దక్కుతుంది” – ‘లవర్’ ట్రైలర్ విడుదల కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత దిల్‌రాజు చేసిన వ్యాఖ్యలు.

 

రాజ్ తరుణ్ హీరోగా అనీష్ కృష్ణ దర్శకత్వం వహించిన ‘లవర్’కి దిల్‌రాజు అన్న కొడుకు హర్షిత్ రెడ్డి నిర్మాత. దిల్‌రాజు కథ ఓకే చేస్తే… కర్త, కర్మ, క్రియ అన్నీ తానై సినిమా నిర్మించాడు హర్షిత్. కీలక నిర్ణయాలు అన్నీ అతడే తీసుకున్నాడని దిల్‌రాజు తెలిపాడు. సాధారణంగా ప్రతి సినిమాకి దర్శక నిర్మాతల మధ్య కొన్ని అంశాల్లో విబేధాలు వస్తాయి. దర్శకుడి నచ్చింది నిర్మాతకు నచ్చకున్నా.. నిర్మాతకు నచ్చింది దర్శకుడి నచ్చకున్నా… డిస్కషన్ తప్పదు. కష్టంగా సినిమా నిర్మాణం ముందుకు వెళ్తుంది. ప్రతిసారి దర్శకుడితో కొన్ని విషయాల్లో ఫైట్ చేసే దిల్ రాజు ఈసారి అన్న కొడుకుతో ఫైట్ చేశారు. చివరకు హర్షిత్ తన మాటే నెగ్గించుకుని తనకు కావలసినట్టు సినిమా చేశాడట. ఫైనల్ కాపీ చూస్తే ఆశించిన రీతిలో లేదని నిర్ణయానికి వచ్చేశారు. అందుకనే సినిమా తప్పకుండా హిట్టవుతుందని కాకుండా ప్రేక్షకులకు నచ్చితే హిట్ వస్తుందని వ్యాఖ్యానించార్ట‌.

 

గతేడాది దిల్‌రాజు సంస్థ నుంచి ఆరు సినిమాలు వచ్చాయి. నాలుగు సినిమాలు అద్భుత విజయాలు సాధిస్తే… రెండు ఓ మోస్తరు విజయాలు సాధించాయి. ప్రతి సినిమా విడదల సమయంలో దిల్‌రాజు కాన్ఫిడెంట్‌గా మాట్లాడారు. ఈసారి మాత్రం ఆయనలో కాన్ఫిడెన్స్ కనిపించడం లేదు. పైగా… “నేను సినిమా చేయ‌డానికి, వెన‌కుండి సినిమా చేయించ‌డానికి చాలా తేడా ఉంది. వెనకుండి చేయించడం క‌ష్ట‌మైన ప‌ని” అంటున్నారు. సినిమా విడుదలకు ముందే ఆయనకు ఫలితం ఏంటో తెలిసింది కాబట్టే ఈ వ్యాఖ్యలు చేస్తున్నారని ఇండస్ట్రీ జనాలు వ్యాఖ్యానిస్తున్నారు.