ఈ మాటలు అన్నది మరెవరో కాదు ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు. ఆయన ఎందుకంత ఆవేశంగా మాట్లాడాల్సి వచ్చిందీ అంటే…. తమ సినిమాకు థియేటర్లు ఇవ్వడం లేదని ఆదివారం ‘పేట’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నిర్మాత అశోక్ వల్లభనేని, తుమ్మల ప్రసన్నకుమార్ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు.
దిల్ రాజు మాట్లాడుతూ.. ‘‘డబ్బంగ్ చిత్రానికి థియేటర్లు ఎలా అడ్జస్ట్ అవుతాయి? సంక్రాంతి బరిలో ఉన్న తెలుగు చిత్రాల విడుదల తేదీలు ఆరు నెలల క్రితమే ఖరారయ్యాయి. ఇప్పుడు ఏ నిర్మాత అయితే తనకు థియేటర్లు ఇవ్వడం లేదని కామెంట్స్ చేశారో… అదే నిర్మాత ‘సర్కార్’ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఎన్ని థియేటర్లు కావాలో… అన్ని థియేటర్లలో వేసుకున్నారు.
ఇప్పుడు అనవసరమైన స్టేట్మెంట్లు ఇస్తున్నారు. తెలుగు సినిమాలను తగ్గించుకుని మిగతా సినిమాలను విడుదల చేయలేం కదా? ఈ నెల 18నుంచి థియేటర్లన్నీ తమ సినిమాకు అందుబాటులోకి వస్తాయని అతని తరఫున కొందరు అన్నారు. అదే నిజమైతే వారి సినిమాను 18న విడుదల చేస్తే సరిపోతుంది కదా!
ఇవేవీ ఆలోచించకుండా… నోరు జారి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడారు. మేమూ అటువంటి మాటలు మాట్లాడగలం. కానీ, నాకు ఒక క్యారెక్టర్ ఉంది. ఇక్కడ మనం చేస్తున్నది వ్యాపారం. వాళ్ళు సినిమా కొన్నది కూడా డబ్బు సంపాదించడానికే. మంచి సినిమాలు చేసి ప్రేక్షకుల నుంచి డబ్బులు తెచ్చుకోవాలని మేమూ వ్యాపారం చేస్తున్నాం. డిస్ట్రిబ్యూషన్‌లో నాకు ఎన్నో డబ్బులు పోయాయి. అయినా… సినిమాపై ఉన్న ప్రేమతో ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నా.
ఆరు నెలల క్రితం రిలీడ్ డేట్స్ ప్రకటించిన తెలుగు సినిమాలకు థియేటర్లు ఉండాలా? వద్దా? రామ్ చరణ్‌గారి సినిమా భారీ బడ్జెట్‌తో వస్తుంది. అటు ‘యన్.టి.ఆర్’ బయోపిక్, ‘ఎఫ్ 2’ ప్రతిష్టాత్మక చిత్రాలు. వీటికి థియేటర్లు అడ్జస్ట్ చేయలేక… రాజీ పడి మేం ఒక అండర్‌స్టాండింగ్‌తో వెళ్తున్నాం. మధ్యలో వచ్చి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే ఎలా?’’ అని అన్నారు.
మొత్తానికి ‘‘సంక్రాంతి సీజన్‌లో తెలుగు సినిమాలకు కాకుండా వేరే సినిమాలకు థియేటర్లు ఇచ్చే పరిస్థితి లేదు’’ అని నిర్మాత ‘దిల్’ రాజు తేల్చి చెప్పారు.