బాహుబలి నిర్మాతలతో దిల్ రాజు ప్లాన్?
టాలీవుడ్లో కొత్త తరహా సినిమాల ప్రవాహం మొదలైంది. దీంతో వెటరన్ డైరెక్టర్ల పనైపోయిందనే వాదన బలంగా వినిపిస్తోంది. గత కొన్ని నెలలుగా వస్తున్న సినిమాల తీరుతెన్నులు నిశితంగా గమనిస్తున్న వెటరన్స్ సైతం సినిమాలు చేయడానికి వెనకాడుతున్నారు. సీనియర్ దర్శకులతో పనిచేయడానికి మన హీరోలు ఏమాత్రం ఆసక్తిని చూపించడం లేదు. కానీ త్వరలో ఓ అద్భుతం జరగబోతోంది. ఓ యంగ్ హీరోతో వెటరన్ డైరెక్టర్ కలిసి పనిచేయబోతున్నారు. ఈ ప్రాజెక్ట్ అందరిని షాక్ కు గురిచేయబోతోంది. ఇంతకీ ఆ వెటరన్ ఎవరు.. ఆ యువహీరో ఎవరు? అంటే షాకిచ్చే వివరమే ఇది. ఆ హీరో మరెవరో కాదు నాగశౌర్య. ఆ వెటరన్ డైరెక్టర్ దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు. ఈ ఇద్దరి కలయికలో ఓ రొమాంటిక్ ఎంటర్ టైనర్ తెరకెక్కనుంది.
అప్పట్లో వరుస రొమాంటిక్ సినిమాలతో శ్రీకాంత్, జగపతిబాబు, జేడీ చక్రవర్తి వంటి హీరోలకు మ్యూజికల్ హిట్స్ అందించిన రాఘవేంద్రారావు యంగ్ హీరో నాగశౌర్యకు కూడా అలాంటి చిత్రాన్నే ప్లాన్ చేస్తున్నాడట. ఇక రాఘవేంద్రుడి రొమాంటిక్ ఫిల్మ్ అంటే అందులో ఇద్దరు లేదా ముగ్గురు అందగత్తెలు వుండాల్సిందే. ఈ చిత్రంలోనూ ముగ్గురు హాట్ గాళ్స్ ని తీసుకుంటున్నారట. త్వరలో సెట్స్‌పైకి రాబోతున్న ఈ చిత్రాన్ని బాహుబలి నిర్మాతల్లో ఒకరైన శోభు యార్లగడ్డ నిర్మించాలని ప్లాన్ చేశారు. అయితే ప్రాజెక్ట్ నచ్చడంతో అతనితో కలిసి దిల్ రాజు కూడా జాయిన్ అవుతున్నారట.
యంగ్ హీరో నాగశౌర్య ప్రస్తుతం సొంత నిర్మాణ సంస్థ ఐరా క్రియేషన్స్ నిర్మిస్తున్న చిత్రంలో నటిస్తున్నాడు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన చిత్రీకరణలో నాగశౌర్య ప్రమాదానికి గురై కాలు ఫ్రాక్చర్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కోలుకున్న శౌర్య షూటింగ్లో పాల్గొంటున్నాడు. త్వరలోనే రాఘవేంద్రరావు రూపొందించనున్న సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం వుందని తెలిసింది. తాజా చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే బయటికి రానున్నాయని ఫిల్మ్ సర్కిల్స్ టాక్.