మహేష్ బాబును రాజకీయంగా ఇబ్బంది పెడుతున్నారా?

మహేష్ బాబు ఏషియన్ ఫిల్మ్స్ సంస్థతో కలిసి నిర్మించిన ఏంఎబీ సినిమాస్ మల్లీప్లెక్స్ తాజాగా ఓ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే ఈ థియేటర్ లో టికెట్ రేట్ల విషయంలో నిబంధనలను పాటించడం లేదని కంప్లైంట్స్ వెళ్లాయి. జీఎస్టీని కేంద్రం తగ్గించినా, ఆ మేరకు ప్రయోజనాలను ప్రేక్షకులకు అందించలేదని ఆరోపిస్తూ, షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. అయితే ఈ విషయాన్ని మెల్లిగా రాజకీయం చేసేస్తున్నారు నేతలు.

ఈ ఇష్యూపై మంత్రి దేవినేని ఉమ మాట్లాడుతూ..కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నందుకే ఎంపీ గల్లా జయదేవ్ పై ఐటీ, ఈడీ దాడులు జరిగాయని, ఆయన బావమరిది ఇప్పుడు మహేష్ బాబునూ జీఎస్టీ కేసుతో ఇబ్బంది పెడుతున్నారని పేర్కొన్నారు. హైదరాబాద్ లో వ్యాపారాలు ఉన్న టీడీపీ నేతలను బెదిరించే వైసీపీలో చేర్చుకుంటున్నారని ఆయన ఆరోపించారు.

ఇక, వివిధ దేశాల్లో దాచుకున్న డబ్బులు తీసుకురావడానికే జగన్ లండన్ వెళ్లారని, ఆయన అక్కడ ఏయే దేశాల వారితో మాట్లాడుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. వైసీపీ నుంచి పోటీ చేసే ఒక్కో అభ్యర్థి 100 కోట్లు ఖర్చు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన ఆరోపించారు.

కేసు ఏంటి

సాధారణ థియేటర్ తో పోలిస్తే, ఏయంబీ సినిమాస్‌ లో సినిమా చూడాలంటే భారీగా ఖర్చు పెట్టాల్సివుంటుంది. ఇటీవల కేంద్ర బడ్జెట్ లో రూ. 100కు పైగా టికెట్ ధర ఉన్న థియేటర్లలో జీఎస్టీని 28 నుంచి 18 శాతానికి తగ్గించిన సంగతి తెలిసిందే.

అయితే, ఏఎంబీ సినిమాస్ లో మాత్రం ధరలను తగ్గించలేదు. ఈ విషయాన్ని తెలుసుకున్న రంగారెడ్డి జిల్లా జీఎస్టీ కమిషనరేట్ యాంటీ ప్రాఫిటీరింగ్ వింగ్ అధికారులు నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తోంది. దీనిపై స్పందించిన ఏయంబీ సినిమాస్‌ భాగస్వామి ఏసియన్ గ్రూప్ ప్రతినిధి సునీల్‌, అధికారులు తనిఖీలు చేసిన విషయం వాస్తవమేనని, అయితే, నోటీసులు మాత్రం ఇవ్వలేదని అని చెప్తున్నారు.

ఏషియన్ సునీల్ మాట్లాడుతూ…. జీఎస్టీ తగ్గింపు విషయంలో ఏఎంబీ మల్టీప్లెక్స్ కు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని స్పష్టం చేశారు. అధికారులు థియేటర్ ని వచ్చిన మాట నిజమేనని, కానీ తాము జీఎస్టీ తగ్గించే టికెట్ లు విక్రయిస్తున్నామని, ఆ రికార్డులే అధికారులు అడిగితే వారికి ఇచ్చామని వివరించారు. పెనాల్టీ కట్టాలని ఎలాంటి నోటీసులు అధికారులు ఇవ్వలేదని వెల్లడించారు. ఒకవేళ నోటీసులు ఇచ్చినా.. ఎంత కట్టాలని చెబుతారో అంత కట్టడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.