బాహుబలి ముందు బాహుబలి తర్వాత రానా కెరీర్ ని డిఫైన్ చేయాల్సి ఉంటుంది. భళ్లాలదేవగా యూనివర్శల్ స్టార్ అయ్యాడు. పాన్ ఇండియా అప్పీల్ వర్కవుటవ్వడంతో రానా అనూహ్యంగా తన ప్లానింగ్స్ ని అడ్వాన్స్ లెవల్ కి తీసుకెళ్లాడు. సాటి స్టార్లతో పోటీపడుతూ తన రేంజును విస్తరించే వ్యూహాన్ని అతడు అనుసరించాడు. ఆ క్రమంలోనే తెలుగు-తమిళం సహా సౌత్ అన్ని భాషల్లో హిందీలోనూ సత్తా చాటేందుకు ప్లాన్ చేశాడు. పాన్ ఇండియా కంటెంట్ ని పుల్ చేస్తూ భారీ సినిమాల్లో నటించేందుకు ప్రణాళికల్ని సిద్ధం చేశాడు. అందుకు డాడీ కం అగ్ర నిర్మాత డి.సురేష్ బాబు ఎంతో సహకారం అందించారు.
అలా మొదలైనవే.. అరణ్య (హాథీ మేరా సాథీ).. హిరణ్యకశిప.. లాంటి భారీ ప్రాజెక్టులు. ఇవి రెండూ పూర్తిగా పాన్ ఇండియా బేస్ సినిమాలు. అత్యంత భారీ బడ్జెట్లతో తెరకెక్కుతున్నవి. ఇక అరణ్య ఇప్పటికే మెజారిటీ చిత్రీకరణ కూడా పూర్తయిపోయింది. నిర్మాణానంతర పనులు సాగుతున్నాయి. ఆ మూవీ సంగతి అటుంచితే హిరణ్యకశిప చిత్రం ఈపాటికే రెగ్యులర్ చిత్రీకరణకు వెళ్లాల్సినది. ఊహించని విధంగా కరోనా బాంబ్ పెద్ద పంచ్ వేసేసింది. ఈ మూవీ కోసం డి.సురేష్ బాబు- గుణశేఖర్ బృందం పెద్ద కంపెనీల టై అప్ తో బిగ్ ప్లాన్ వేశారు కానీ ఊహించని ఉత్పాతంలా కరోనా మహమ్మారీ ముంచుకొచ్చింది. లాక్ డౌన్ లతో అట్టుడికిపోతోంది.
కరోనా ముందు .. కరోనా తర్వాత!! అన్నంతగా పరిస్థితి మారిపోయింది. టాలీవుడ్ కి ఇప్పటికే 600 కోట్లు పైగా నష్టం వాటిల్లిందని అంచనా వేస్తున్నారు. ఇందులో ఆ నలుగురు – డి.సురేష్ బాబు సహా సపరేట్ యాక్టివ్ గిల్డ్ లో ఉన్న పలువురు అగ్ర నిర్మాతల షేర్ చాలా ఎక్కువ. ఇప్పుడు వీళ్లంతా టాలీవుడ్ పరిస్థితిపైనా రివ్యూలు చేసుకుని బడ్జెట్లు కుదించే పనిలో ఉన్నారు. లాక్ డౌన్ వల్ల థియేటర్లు తీసే సీన్ లేదు. ఇప్పట్లో జనం థియేటర్లకు వచ్చే అవకాశం కనిపించడం లేదు. అలాగే షూటింగులు ఎక్కడివక్కడే బంద్. దీంతో భారీ ప్రాజెక్టులపై పునరాలోచన చేస్తున్నారంతా. అలాగే డి.సురేష్ బాబు- రానా బృందం హిరణ్యకశిప స్టాటస్ పైనా రివ్యూలు చేస్తున్నారని తెలిసింది. ఈ రెండు మూడు నెలల్లో అయితే పరిస్థితి సాధారణ స్థితికి వచ్చేట్టు కనిపించడం లేదు. ఇలాంటప్పుడు హిరణ్య కశిపను భారీ బడ్జెట్ తో తీయడమెలా? ఇప్పటికే హైదరాబాద్ – అమెరికా సహా పలు దేశాల్లో మూవీ విజువలైజేషన్ కి సంబంధించిన ప్రీ- వర్క్ జరుగుతోందని చెప్పారు. కానీ వాటన్నిటికీ బోలెడంత బడ్జెట్ పెట్టాల్సి ఉంటుంది. వీఎఫ్ ఎక్స్ బేస్డ్ సినిమా కాబట్టి సొమ్ముల్ని మంచి నీళ్లలా ఖర్చు చేయాలి. ఇలాంటప్పుడు అంత భారీ సినిమా తీస్తే తట్టుకోగలమా? సినిమా తెరకెక్కినా సరిగా రిలీజ్ చేయగలమా? కరోనా మహమ్మారీ ఎంత కాలం ఇలా పీడిస్తుందో చెప్పలేకపోతున్న వేళ ఈ రిస్క్ అవసరమా? అంటూ రివ్యూలు చేస్తున్నారట.
ఓవైపు ఎగ్జిబిషన్ రంగంలో పురోభివృద్ధి సాధ్యపడాలని… తిరిగి పరిస్థితులు యథాస్థితికి రావాలని రానా .. సురేష్ బాబు వంటి వాళ్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఇండస్ట్రీ భవిష్యత్ ఎలా ఉండబోతోంది? జనాలు థియేటర్లకు వస్తారా రారా? ఇవన్నీ వీళ్లంతా రివ్యూ చేస్తున్నారు. ఇక భయం గుప్పిట బతుకుతున్న జనాల్ని ఇంతకుముందులా కాకపోయినా కనీసమాత్రంగా అయినా థియేటర్లకు రప్పించేందుకు ఎలాంటి స్కెచ్ వేయాలి? అన్నదానిపైనా రానా- సురేష్ బాబు బృందం కసరత్తు చేస్తోందట. ఊహించని పిడుగుతో ఇలా అయ్యింది పరిస్థితి. మరి ఎప్పటికి యథాస్థితికి వచ్చి సర్ధుకుంటుందో ఇండస్ట్రీ.
