‘మణికర్ణిక’ : చిరు పనిగట్టుకుని ఎందుకు చూసారంటే…

వీరనారి ‘ఝాన్సీ లక్ష్మీబాయి’ జీవితచరిత్ర ఆధారంగా రూపొందిన చిత్రం ‘మణికర్ణిక’ . క్రిష్ – కంగనా దర్శకత్వం వహించిన ఈ సినిమా, రిపబ్లిక్ డే సందర్భాన్ని పురస్కరించుకుని ఈ నెల 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. లక్ష్మీబాయి లుక్ తో కంగనా వందకి వంద శాతం మార్కులు కొట్టేయడంతోనే ఈ సినిమాపై ఇంట్రస్ట్ ఏర్పడింది. టీజర్ .. ట్రైలర్ తో అంచనాలు రెట్టింపు అయ్యాయి.

ఇలా భారీ అంచనాల మధ్య థియేటర్స్ కి వచ్చిన ఈ సినిమా, దేశవ్యాప్తంగా 3 రోజుల్లోనే 50 కోట్ల మార్క్ కి చేరువైపోయి హాట్ టాపిక్ గా మారిపోయింది. మరో ప్రక్క ఓవర్సీస్ లోను ఈ సినిమా వసూళ్లపరంగా తన దూకుడు చూపుతోంది. ఇప్పటికే ఒక మిలియన్ డాలర్ల క్లబ్ లోకి చేరిపోయింది. ఇక ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా ఇదే జోరును కనబరిస్తోంది.

ఈ నేపధ్యంలో ఈ చిత్రాన్ని చిరంజీవి తన సైరా టీమ్ తో కలిసి చూడటం జరిగింది. సురేంద్రరెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం సైతం ఇలాంటి కథ,కథనంతోనే రెడీ అవటంతో ఆయన తమ సినిమాని బేరేజ్ వేసుకోవటానికి థియోటర్ కు వెళ్లి చూసినట్లు సమాచారం. రెండు మూడు సీక్వెన్స్ లు తప్ప మిగతాదంతా ఒకే రకమైన కథనం అని అభిప్రాయపడ్డారట. దాంతో తమ చిత్రం సైతం ఘన విజయం సాధిస్తుందనే ధైర్యం టీమ్ కు వచ్చిందిట. ఇక చిరంజీవికు అయితే ఈ సినిమా తెగ నచ్చేసిందిట. పరుచూరి బ్రదర్శ్, మరికొందరు యువ రచయతలు ఈ సినిమా చూసి తమ సైరా లో కొన్ని మార్పులు , చేర్పులు చేస్తే బావుంటుందని భావించారట.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చారిత్రక చిత్రం సైరా నరసింహారెడ్డి. ఆంగ్లేయులను ఎందిరించిన మొట్ట మొదటి తెలుగు నాయకుడిగా పేరు తెచ్చుకున్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సురేందర్‌ రెడ్డి దర్శకుడు. తల్లి కోరిక మేరకు మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్ భారీ బడ్జెట్‌తో తన తండ్రికి కానుకగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

దాదాపు 250 కోట్ల బడ్జెట్‌తో సైరా తెరకెక్కుతున్నట్టుగా తెలుస్తోంది. సైరాను దసరా సందర్భంగా రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నట్టుగా రామ్ చరణ్ వెల్లడించారు. ఇప్పటికే మేజర్‌ పార్ట్‌ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో చిరు సరసన నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా అమితాబ్‌ బచ్చన్‌, జగపతి బాబు, తమన్నా, సుధీప్‌, విజయ్‌ సేతుపతిలు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.