ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా ఉప్పెన సంగతులే వినిపిస్తున్నాయి. ఇక యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఉప్పెన టీం ఇంటర్వ్యూలే దర్శనమిస్తున్నాయి. ఉప్పెన సినిమాపై ఉన్న అంచనాలకు తగ్గట్టుగానే మైత్రీ మూవీస్ మంచి ప్రమోషన్ చేస్తోంది. హీరో హీరోయిన్లు దర్శకులు మీడియాతో ఇంటరాక్ట్ అవుతున్నారు. సినిమాకు సంబంధించిన విషయాలెన్నో చెప్పుకొచ్చారు. ఉప్పెన ట్రైలర్ వచ్చాక అందరూ ఓ విషయం మీద ఫిర్యాదు చేశారు.
ఉప్పెన ట్రైలర్‌లో అంతా బాగానే ఉంది గానీ.. విజయ్ సేతుపతికి చెప్పించిన డబ్బింగ్ బాగా లేదని అందరూ కామెంట్ చేశారు. విజయ్ సేతుపతి ఒరిజినల్ వాయిస్ పెట్టి ఉంటే బాగుండేదనే టాక్ వచ్చింది. దీనిపై తాజాగా దర్శకుడు స్పందించాడు. ఈ పాత్రకు తన డబ్బింగ్ సరిపోదని, వాయిస్ సెట్ కాదని విజయ్ సేతుపతి ముందే చెప్పాడట. అందుకే ఈ పాత్రకు తగ్గట్టు డబ్బింగ్ చెప్పే వారి గురించి చాలా వెతికామని బుచ్చిబాబు తెలిపాడు. ఇంతకుముందు విజయ్ సేతుపతి పాత్రకు డబ్బింగ్ చెప్పే వారిని కూడా పరిశీలించామని కానీ సెట్ కాలేదని అన్నాడు.
అందుకే రవి శంకర్‌ను తీసుకున్నాం. డబ్బింగ్ ఆర్టిస్ట్‌లో ఆయనకు ఇండియా మొత్తంలో ఎక్కువ రెమ్యూనరేషన్.. ఎలాంటి సినిమా అయినా.. ఒక్కరోజులోనే డబ్బింగ్ చెప్పేసి వెళ్లిపోతారట. అలా ఈ సినిమాకు కూడా చెబుదామని వచ్చాడట. అయితే సినిమా చూసి ఇలా ఉందేంటని చెప్పి.. మూడు రోజులు ఉండి మరీ డబ్బింగ్ చెప్పాడని డైరెక్టర్ అన్నాడు. మరి అరుంధతి సినిమాకు డబ్బింగ్ చెప్పి సినిమా స్థాయిని పెంచిన రవిశంకర్.. ఉప్పెనలో విజయ్ సేతుపతి పాత్ర డబ్బింగ్‌తో అంతకు మించి అని అనిపిస్తాడా? లేదా అన్నది చూడాలి.