బిగ్‌బాస్ షో ప్రారంభమైన మూడు వారాలు అయిపోయింది. నాల్గో వారంలో అన్నీ వింతలే జరుగుతున్నాయి. కొత్త ట్రాకులు, లవ్ స్టోరీలు ఏర్పడుతున్నాయి. స్నేహితులుగా ఉన్నవారి మధ్య విబేధాలు, విబేధాలున్న వారి మధ్య స్నేహగీతం మొదలైంది. ఇదంతా ఓ లెక్క అనుకుంటే.. షో స్టార్ట్ అయి ఇన్ని రోజులు అవుతున్నా మోనాల్ తెలుగులో మాత్రం అస్సలు మాట్లాడదు, ఇక మోనాల్ పరిస్థితి అర్థం చేసుకుందామని అనుకుంటే.. హారిక తెలుగమ్మాయి అయి ఉండి కూడా ఇంగ్లీష్‌లోనే దంచికొడుతోంది.
బిగ్‌బాస్ మాత్రం మోనాల్‌నే టార్గెట్ చేశాడు. నిన్నటి ఎపిసోడ్‌లో హారిక అభిజిత్ ఇంగ్లీష్‌లో తెగ మాట్లాడుకున్నారు. కానీ తెలుగులో మాట్లాడమని బిగ్‌బాస్ మైకులో అనౌన్స్ చేయలేదు. అదే తన బాధ అగ్ని పర్వతంలా బద్దలవుతుంటే.. ఏం చెప్పాలో ఎలా చెప్పాలో ఎవరికి చెప్పాలో అర్థం కాక.. తన బాధను తనకు వచ్చిన హిందీ భాషలో బాత్రూం కెమెరా వద్ద చెప్పుకొచ్చింది. అప్పటికే కొంత ఏడుస్తున్న మోనాల్‌ను తెలుగులో మాట్లాడమంటూ ఆదేశించాడు బిగ్‌బాస్.
నేను మాట్లాడలేను.. నాకు రాదు..ఎమోషన్ అంతా బయటకు పోవాలి అంటూ ఇంగ్లీష్‌లో చెప్పింది. అటు వెంటనే బాత్రూంలోకి వెళ్లి ఓ రేంజ్‌లో ఏడ్చేసింది. తనను ఆటలో అవుట్ చేయడం, అమ్మ రాజశేఖర్ ఫేవరిటజం చూపించడం, లాస్య, దివి ఇలా అందరూ తన దగ్గరి నుంచి కాయిన్స్ దొంగిలించడం వంటి కారణాలతో మోనాల్ బాగానే హర్ట్ అయింది.