`బిగ్ బాస్ రియాల్టీ గేమ్ షో` ఎంట్రీతో స్టార్ మా రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఒక్క గేమ్ షో `స్టార్ మా` టీ ఆర్ పీని టాప్ లో నిలబెట్టింది. రొటీన్ సీరియళ్లతో విసుగుపోయిన అభిమానులకు రోజూతో పాటు శని, ఆదివారాలు ఇంకాస్త ఎక్కువ ఉపశమ నాన్ని కల్గిస్తుంది. బిగ్ బాస్ ప్రసారమైన మూడు నెలలు పాటు ఆ షోకు ప్రత్యేకమైన బానిసతో కూడిన అభిమాన గణాన్ని చూరగొంటుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా చేసిన తొలి సీజన్ బ్లాక్ బస్టర్ అయింది. ఆపై రెండవ సీజన్ కు నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా చేసి కొన్ని విమర్శలతో ముగిసింది. ఇక మూడవ సీజన్ ఆరంభానికి ముందు కాస్టింగ్ కౌచ్ ఆరోపణల్ని ఎదుర్కున్నప్పటి కీ చివరిగా కింగ్ నాగార్జున కూల్ గా సీజన్ ముగించారు.
ప్రస్తుతం సీజన్ -4కి రంగం సిద్ధం అవుతోంది. దీనికి నాగార్జున హోస్ట్ గా బాధ్యతలు చేపడుతున్నారు. కరోనా నేపథ్యంలో షో ఉంటుందా? ఉండదా? అని పలుమానాలు తలెత్తినప్పటికీ అంతిమంగా బిగ్ బాస్ -4 ఆపేది లేదంటూ ముందుకొస్తుంది. ఈ నెలఖారు నుంచి ప్రసారం కానుందని తెలుస్తోంది. అయితే కరోనా తెచ్చిన కల్లోలం కారణంగా షో ఫార్మెట్ పూర్తిగా మారిపోతున్నట్లు బిగ్ బాస్ వర్గాల సమాచారం. అసలే కుప్పలు తిప్పలుగా అనుమానాలున్న షో పై మరో పెనుభూతం లాంటి పిడుగు పడిందన్న వార్త మీడియాను అంతకంతకు వేడెక్కిస్తోంది. ఇది రికార్డెడ్ షో అని ఇప్పటికే పెద్ద ఎత్తున ఓ వాదన ఉంటే…కాదు కాదు లైవ్ టెలికాస్ట్ అని ఇంకొంత మంది అంతే బలంగా వాధించిన వర్గం ఉంది.
ఇప్పుడు ఈ రెండింటిని మించిన సునామీ లాంటి వార్త…బిగ్ బాస్ ని స్మాష్ చేసే వార్త ఒకటి తెరపైకి వచ్చింది. ఇప్పటివరకూ బిగ్ బాస్ అంటే ఒక్క రోజు ముందు జరిగిన విశేషాల్ని ఆ మరుసటి రోజు ఎపిసోడ్ లో చూపించేవారు. అంటే సోమవారం ప్రసారమయ్యే ఎపిసోడ్ ఆదివారం జరిగిందన్న మాట. అయితే ఇప్పుడా ఫార్మెట్ ని పూర్తిగా మార్చేస్తూ ఏకంగా వారం రోజులు వెనక్కి తొసేస్తు న్నారుట. అంటే ఒక్కరోజు ఆలస్యాన్ని వారం రోజులు తోసేయడం. ఇది కేవలం కరోనా కారణంగానే ఇలా చేయాల్సి వస్తోందిట. హౌస్ లో కంటెస్టెంట్లు ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకునే నిర్వాహకులు ఈ విధంగా ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది.
అలాగే వీకెండ్ ఎపిసోడ్స్ లో ఆడియన్స్ వచ్చేవారు. హోస్ట్ కనిపించేవారు. కానీ కొత్త ఫార్మెట్ లో ఆడియన్స్ ఉండబోరని సమాచారం. కేవలం కంటెస్టెంట్లు…హోస్ట్ మాత్రమే కనిపించనున్నారు. ఈ అంశాల్లో లోటుపాట్లు ఎక్కడా కనిపించకుడా నిర్వాహకులు పక్కా ప్లానింగ్ తో బ్యాకెండ్ వర్క్ చేస్తున్నట్లు తెలిసింది. ఇది నిర్వాహకులు అనుకున్న ప్రకారం జరిగితే పర్వాలేదు. అందులో ఎక్కడా తేడా జరిగినా సీనే రివర్స్ అవుతుంది. బిగ్ బాస్ తో మాటీవి ప్రత్యేకమైన టీఆర్పీని సొంతం చేసుకుంది. అదంతా బుగ్గిపాలవ్వడంతో పాటు..విమర్శల్ని మూటగట్టుకోవాల్సి వస్తుంది సుమీ.