`బిగ్ బాస్ సీజన్-3`పై తీవ్ర స్థాయిలో కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. కమిట్ మెంట్ ఇస్తేనే కంటెస్టెంట్ గా ఛాన్స్ ఇస్తామని నిర్వాహకులు కాస్టింగ్ కౌచ్ కి పాల్పడినట్లు పలువురు నటులు, యాంకర్లు ఆరోపించారు. ఈ నేపథ్యంలో హోస్ట్ గా వ్యవరించిన నాగార్జునను సైతం వదిలి పెట్టలేదు. ఓ పెద్ద స్టార్ అయి ఉండి ఇలాంటి ఆరోపణలు వచ్చిన సమయంలో కూడా నాగార్జున తమ పక్షాన నిలబడకుండా నిర్వాహకులకే కొమ్ము కాస్తున్నారని మండిపడ్డారు. దీనిపై పోలీస్ స్టేషన్లో కేసులు అని..కోర్టులో వాదనలని చాలా హంగామనే చేసారు. ఈ విషయంలో ఎంత దూరమైనా వెళ్తామని..ఎవర్నీ విడిచి పెట్టమని తప్పు చేసిన వాళ్లు శిక్ష అనుభవించాల్సిందేనని ఛాలెంజ్ లు సైతం చేసారు.
ఆ తర్వాత ఈ ఆరోపణల్ని నిర్వాహకులు ఖండించడం జరిగింది. ఇప్పటికీ అప్పటి వివాదంపై కేసు నడుస్తోంది. వాటితో సంబంధం లేకుండా బిగ్ బాస్ నిర్వాహకులు చేయాల్సిందల్లా చేసేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం బిగ్ బాస్ -4కి రంగం సిద్దమవుతోన్న సంగతి తెలిసిందే. గత ఎపిసోడ్ల మాదిరిగానే ఈసారి కూడా పెద్ద ఎత్తున కంటెస్టెంట్ల ఎంపిక జరుగుతోంది. హోస్ట్ గా నాగార్జుననే మళ్లీ కొనసాగిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోలో ప్రత్యేకంగా సెట్ నిర్మిస్తున్నారు. ఇలా ఎక్కడికక్కడ బిగ్ బాస్ సీజన్ -4 కి సంబంధించి ఎవరి పనుల్లో వాళ్లు బిజీ అయ్యారు. అయితే `బిగ్ బాస్ -3` టైమ్ లో ఛాలెంజ్ లు చేసిన గ్యాంగ్ ఇప్పుడు ఎక్కడా కనిపించలేదు.
బిగ్ బాస్ లో లైంగిక వేధింపులు జరిగితే సహించబోమని చెప్పిన ఆ బ్యాచ్ ఇప్పుడు పత్తా లేదు. అసలు బిగ్ బాస్ పై ఆ రకమైన పోరాట పటిమే ఎక్కడా కనిపించలేదు. లైంగిక వేధింపులపై నిరంతర పోరాటం చేస్తామని చెప్పిన ఓ యాంకరమ్మ అయితే మీడియాలో ఎక్కడా కనిపించకపోవడం విశేషం. మరి ఈ మౌనం దేనికి సంకేతం. సరైన సమయం రాలేదని ఇంకా బయటకు రాలేదా? లేక ! అనవసరంగా మళ్లీ వివాదం తెరపైకి తీసుకొచ్చి నెత్తిన వేసుకోవడం ఎందుకని సైలెంట్ అయ్యారా? అన్నది తెలియాల్సి ఉంది.