సంపూ 3.30 నిముషాల డైలాగ్ వెనక అసలు కథ
సంపూర్ణేష్ బాబు తాజా చిత్రం ‘కొబ్బరిమట్ట’ లో 3.30 నిమిషాల సింగిల్ షాట్ డైలాగ్ ట్రైలర్‌ను ఆదివారం విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. దీన్ని చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోయారు. సంపూను మెచ్చుకున్నారు. ఇది ప్రపంచ సినిమా చరిత్రలోనే రికార్డని యూనిట్ పేర్కొంది. అయితే ఈ డైలాగ్ చెప్పడం వెనుక పెద్ద కథే ఉందని సాయి రాజేష్ ట్వీట్ చేశారు.
సాయి రాజేష్ మాట్లాడుతూ.. ‘‘ధనుష్ ‘వీఐపీ’ సినిమాలో చెప్పిన డైలాగ్ చూసినప్పుడు ‘కొబ్బరిమట్ట’ స్క్రిప్ట్‌లో సంపూతో అలాంటి డైలాగ్ చెప్పించాలి అనుకున్నా. 1.30 నిమిషాలు ఆడవారి మీద డైలాగ్ షూట్ చేసిన తర్వాత నాలోని రాక్షసుడు నిద్ర లేచాడు. మగవాళ్ల గురించి 3.30 నిమిషాల డైలాగ్ చెబితే.. ‘ప్యార్ కా పంచ్‌నామా’ రికార్డ్ బద్దలు కొట్టొచ్చు. ఎక్కువ సేపు డైలాగ్ చెబితే పేరు వస్తుంది అనుకున్నా. మగాడి గొప్పతనం గురించి ఐదు వెర్షన్స్‌లో డైలాగ్స్ రాశా. చాలా సంతోషంగా అనిపించింది. కానీ, తర్వాత వెంకటకవులు రాసిన ‘దానవీరశూరకర్ణ’కి పేరడీగా డైలాగ్స్ రాసుకున్నా. రఘురాం శ్రీపాద, శబ్ద రత్నాకరం సహాయంతో దాన్ని గ్రాంథికంలోకి మార్చా. డైలాగ్ రెడీ’.
‘ఆనందంగా సంపూకి డైలాగ్ వాట్సాప్ చేస్తే.. నేను చెప్పలేను అన్నాడు. మగాడి డైలాగే బాగుంది అన్నాడు. నాకు ఒళ్ళు మండింది. ‘ఏంటి? డైలాగ్ చెప్పలేను అనే స్థాయికి ఎదిగిపోయాడా, కొవ్వుపట్టిందా’ అనుకున్నా. నా ఆవేశం చూసిన మా చిత్ర బృందం నాకు సర్దిచెప్పడానికి ప్రయత్నిస్తూ.. ‘కష్టంలెండి, వదిలెయ్యండి. మగాడి డైలాగ్ బాగుంది’ అన్నారు. దీంతో నాకు ఈగో పెరిగిపోయింది. ‘ఎల్లుండి షూటింగ్ పెడుతున్నా.. చెప్తే నీకు కెరీర్ ఉంటుంది. లేకపోతే నాకు మూడు లక్షలు పోతాయి. నీ కర్మ అన్నాను’ అని సంపూతో చెప్పా’.
‘అప్పటికే సినిమా షూటింగ్ మొత్తం అయిపోయింది. కేవలం ఇదొక్క షాట్ తీస్తే సినిమాకి హైప్ వస్తుంది అనుకున్నా. నా పరిస్థితి తెలిసిన నా స్నేహితుడు వారించాడు. జేబులో, బ్యాంకులో డబ్బులు ఖాళీ అయ్యాయి. ‘అవసరమా నీకు మళ్లీ షూటింగ్’ అన్నారు. లేదు చెయ్యాల్సిందే అనుకున్నాను. నానా కష్టాలు పడి డబ్బులు తెచ్చాను. షూటింగ్ పెట్టా. సంపూ ‘అన్నా.. కష్టంగా ఉంది. చెప్పలేను’ అన్నాడు. నేను వినలేదు. చివరికి షూటింగ్‌కు ఏర్పాట్లు జరిగాయి.
ఒక్క షాట్, రూ.3 లక్షలు. మొత్తం సెట్ చేసిన తర్వాత వర్షం భయంకరంగా పడింది. మూడు లక్షలు మటాష్. అందరూ ఆనందంగా ఉన్నారు, నేను తప్ప. సంపూ ఇంకా ఆనందంలో ఉన్నాడు. నా బాధ ఎవరికి చెప్పుకోను. అయినా సరే మళ్లీ డబ్బులు సిద్ధం చేశా. సంపూని రెడీ అవ్వమని చెప్పా. ‘సరే అన్నా’ అన్నాడు. కచ్చితంగా డైలాగ్ చెబుతాడని నాకు తెలుసు. రాత్రింబవళ్లు, ఆఫీసులో, రూమ్‌లో, కార్‌లో, బాల్కనీలో.. ఒక స్కూల్ పిల్లాడిలా నేర్చుకుంటున్నాడు. మనసులో హాట్సాఫ్ చెప్పా’.
‘ఈ ముఖ్యమైన సీన్‌లో నటించేందుకు ఆర్టిస్టులు ముందుకు రాలేదు. కొందరు ‘ఈ సినిమా విడుదలయ్యేది లేదు, దాని కోసం అంతలా నటించడం ఎందుకు’ అన్నారు. చివరికి డైరెక్టర్, కెమెరామెన్ ముజీర్ మాలిక్ షాట్ సిద్ధం చేసుకున్నారు. డైరెక్టర్ కట్ చెప్పే వరకు మౌనంగా నటించండని సెట్‌లో అందరికీ గట్టిగా చెప్పా. ఉదయం 9.40 గంటలు.. డైరెక్టర్ ‘యాక్షన్’ చెప్పాడు. సాయంత్రం వరకు సమయం ఉంది. 10 టేక్‌లు తీసుకున్నా పర్లేదు అనుకున్నాను’.
‘డైరెక్టర్ యాక్షన్ అన్నాడు. అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు. సంపూ చెప్తున్నాడు, చెప్తున్నాడు, చెప్తున్నాడు… అప్పటికీ అందరూ మౌనంగానే ఉన్నారు. లైట్‌మెన్లకి ఏం అర్థం కావటం లేదు, ఆర్టిస్టులు షాక్‌లో ఉన్నారు. మూడున్నర నిమిషాలు పూర్తయింది.. ‘కట్ ’ చెప్పారు. అందరూ షాక్‌లో ఉన్నారు. సీన్ అయిపోయింది. ఒక్క టేక్‌లో చెప్పేశాడు. అందరూ ఈలలు వేశారు. ఇద్దరు సంపూ కాళ్లమీద పడ్డారు. హత్తుకున్నారు. భావోద్వేగానికి గురయ్యారు. నేను వెళ్లలేదు.
ఏదో తెలీని ఫీలింగ్, డబ్బులు పోతే పోయాయి. కానీ సంతృప్తి లభించింది. కానీ ఎడిటింగ్ రూమ్‌లో డైలాగ్ పెద్దగా ఉంది అన్నారు. ‘జనంకి చూపించేస్తా. నచ్చి అలవాటు అయితే థియేటర్‌లో చూస్తారు. నచ్చకపోతే కనీసం మాట్లాడుకుంటారు. రెండు రోజుల పబ్లిసిటీ అనుకున్నా. తప్పు చేస్తున్నావు. మైనస్ అయ్యే అవకాశం చాలా ఉంది అన్నారు. ట్రైలర్ కట్ చేశాం. నాకు తెలిసిన వ్యక్తులు అదిరింది అన్నారు. ఇప్పుడు నేను ఎంతో ఆనందంగా ఉన్నా. సంపూని ఇక ఎవరూ నటుడు కాదని అనలేరు’ అని సాయి రాజేష్ పోస్ట్ చేశారు.