కరోనా కల్లోలం నేపథ్యంలో రకరకాల ఆలోచనలు పుట్టుకొస్తున్నాయి. ఇప్పటికే మార్కెట్ షట్ డౌన్ అయిపోయింది. అన్నిటినీ తెరిస్తే రకరకాల క్రియేటివ్ అయిడియాతో వస్తువుల్ని అమ్మాల్సి ఉంటుంది. ఇక ఇలాంటి ఆలోచనల విషయంలో టాలీవుడ్ ప్రముఖులు ఒక ఆకు ఎక్కువే తింటారనడంలో సందేహమేం లేదు. ముఖ్యంగా ఎగ్జిబిషన్ రంగంలో నిష్ణాతుల మైండ్ సెట్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే ఒక్క డి.సురేష్ బాబును పరిశీలిస్తే చాలు.
ఇది బిజినెస్. ఇక్కడ లాభాల కోసం మాత్రమే ఆలోచిస్తారు! అని ఆయన ఎప్పుడో ప్రవచించారు. ఆ ప్రకారమే ఇంతకుముందు ఆయన ఒక మాటన్నారట. థియేటర్లలో బీర్ లు బ్రీజర్లు అమ్మితే ఎలా ఉంటుంది? విదేశాల్లో ఇప్పటికే ఈ విధానం అమల్లో ఉంది కదా? లైసెన్సులు తెచ్చుకుని ఆ ఏర్పాటు కూడా చేస్తే బావుంటుందేమోనని యువహీరో కం సన్ రానాతో ముచ్చటించారట. అయితే ఆ మాటను ఎలా విన్నాడో కానీ నాగ్ అశ్విన్ ఇప్పుడు లాక్ డౌన్ వేళ ఆ టాపిక్ ని తెరపైకి తెచ్చాడు.
“థియేటర్లలో బీర్ బ్రీజర్ అమ్మితే ఎలా ఉంటుంది? మీకు ఓకేనా?“ అంటూ కొత్త డిబేట్ కి తెర తీశాడు ఈ యంగ్ డైరెక్టర్. అయితే జనాల అభిప్రాయాలు మాత్రం వేరొక రకంగా ఉన్నాయి. అలా థియేటర్లలోనే తాగుడుకి తెర తీస్తే ఆ ప్రమాదం ఎలా ఉంటుందో ఎవరికి వారు ఊహిస్తున్నారు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్ ఇక శాశ్వతంగా థియేటర్లకు వచ్చేందుకు అవకాశం ఉండదన్న అంచనాను వ్యక్తం చేస్తున్నారు. నిజమే.. అమ్మ .. అక్క .. చెల్లితో కలిసి బీర్ కొడుతూ సినిమా చూడడం కుదురుతుందంటారా? పైగా థియేటర్ అంటేనే ఆకతాయిలు పోగయ్యే చోటు. అలాంటి చోట చుక్క పడితే ఇంకేమైనా ఉంటుందా? అగ్గి మీద గుగ్గిలం అయిపోరూ? అంటూ వ్యాఖ్యానిస్తున్నారు నెటిజనం. విదేశీ కల్చర్ ని మనం బాగానే అడాప్ట్ చేసుకుంటున్నాం కానీ మరీ వింత పోకడలకు పోతే దాని పర్యవసానం ఇప్పటికే ఇండియా అనుభవిస్తోంది కదా?
