కరోనా కల్లోలం ఆషామాషీగా లేదు. దేశంలో పలు రాష్ట్రాల్ని కొవిడ్ 19 గజగజ ఒణికిస్తోంది. అందులో మహారాష్ట్ర- కర్నాటక సహా తెలుగు రాష్ట్రాలు ఉన్నాయి. ఉత్తరాదిన ఉత్తరప్రదేశ్ పరిస్థితి అలానే ఉంది. అయితే ఇలాంటి చోట బెనారస్ – కాశీ- వారణాసి వంటి చోట కీలక షెడ్యూల్ ని ప్లాన్ చేశాడు బోయపాటి.
నటసింహా నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి తెరకెక్కించాల్సిన ఎన్.బీ.కే 106 బెనారస్ షెడ్యూల్ కి సిద్ధం చేస్తే ఆదిలోనే హంసపాదులా కరోనా ఎటాక్ చేసింది. అసలే ఉత్తరప్రదేశ్ కొవిడ్ దెబ్బకు ఒణికిపోతోంది. ఈ దెబ్బకు అక్కడ షూటింగులకు ప్రభుత్వాలు అనుమతించే పరిస్థితి కనిపించలేదు.
ఇక ఈ మూవీలో అత్యంత కీలకమైన అఘోరా పాత్రను అద్భుతంగా చూపించాలని బోయపాటి కన్న కలలన్నీ కల్లలుగానే మారేట్టు ఉందన్న గుసగుస తాజాగా వినిపిస్తోంది. ఏడాది పాటు కొవిడ్ విలయతాండవం కొనసాగితే ఇంక ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యేదెప్పుడు? అలాంటప్పుడు అఘోరా పాత్రను లేపేయాల్సిందే కదా? అన్న వాదనా అభిమానుల్లో తెరపైకొచ్చింది. అది తీసేసి ఇంకేదైనా బోయపాటి ప్లాన్ చేస్తున్నారా? అన్న చర్చా సాగుతోంది. అయితే అసలు నందమూరి బాలకృష్ణకు ఈ మూవీ మొత్తంగా నచ్చింది ఒప్పించింది అఘోరా పాత్రనే. దానికి అంత పవర్ ఉంది. అలాంటి రోల్ ఉండదు అంటే ఆయన అంగీకరిస్తారా? అంటూ సోషల్ మీడియాల్లో చర్చ సాగుతోంది. మరి ఎన్బీకే- బోయపాటి బృందం ఈ క్రైసిస్ నుంచి ఎలా బయటపడతారో చూడాలి.
