‘రొమాంటిక్’ సినిమాతో ఎలాగైనా హిట్టు కొట్టాలన్న కసితో ఉన్నాడు కుర్ర హీరో ఆకాష్ పూరి. హిట్ కొట్టాలా. తన తండ్రితో కాలర్ ఎగరేయించాలా.. అనే గట్టి పట్టు మీదున్నాడు. ఈ మధ్య పూరీ సినిమాల్లో అసలు విషయం ఉండట్లేదు.. మూస కథలతో సినిమాలు తెరకెక్కిస్తున్నాడు.. అంటూ పూరీపై ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.
ఈ ప్రచారాల నడుమ ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో గట్టిగా హిట్టు కొట్టి పూరీ బౌన్స్ బ్యాక్ అయ్యాడు. అదే ఉత్సాహంతో రౌడీ విజయ దేవరకొండతో భారీ అంచనాల నడుమ ‘లైగర్’ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. దాంతో పాటే, ‘రొమాంటిక్’ మూవీకీ కథ, స్ర్కీన్‌ప్లే తానే అందిస్తున్నాడు పూరీ జగన్నాధ్.
పూరీ తనయుడు.. అనే పెద్ద బ్యాక్ గ్రౌండ్‌ని వెనకేసుకొచ్చిన పూరీ ఆకాష్ ఇంతవరకూ తనను తాను హీరోగా ప్రూవ్ చేసుకోలేకపోయాననీ, అది తనను చాలా బాధిస్తోందనీ, బ్యాక్ గ్రౌండ్ ఉండి ప్రూవ్ చేసుకోలేకపోతే వచ్చే అవమానాలు ఎలా ఉంటాయో, ఎంత దారుణంగా బాధిస్తాయో తనకు తెలుసనీ, అందుకే ఈ సినిమాతో ఎలాగైనా హిట్టు కొట్టాలనీ ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు ఆకాష్ పూరీ.
అనిల్ పాడూరి దర్శకత్వంలో తెరకెక్కిన ‘రొమాంటిక్’ మూవీ ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ముద్దుగుమ్మ కేతికా శర్మ, ఆకాష్‌కి జోడీగా నటిస్తోంది.